లక్నో: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా ఆరు విజయాలతో సెమీ ఫైనల్స్ వైపు దూసుకెళ్తోంది. ఇప్పటివరకు ఓటమి ఎరుగని జట్టుగా నిలిచింది. పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. భారత్ తరువాత దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.
లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏక్నా స్టేడియంలో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది రోహిత్ సేన. 50 ఓవర్లల్లో తొమ్మిది వికెట్ల నష్టానికి 229 పరుగులే చేయగలిగింది. రోహిత్ శర్మ మరోసారి కేప్టెన్సీ ఇన్నింగ్ ఆడాడు. 87 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్-49, కేఎల్ రాహుల్- 39 పరుగులు చేశారు.

230 పరుగుల టార్గెట్‌తో ఛేజింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ చేతులెత్తేసింది. ప్రారంభం నుంచే తడబడింది. ఏ ఒక్కరు కూడా కుదురుగా క్రీజ్‌లో నిల్చోలేకపోయారు. 27 పరుగులు చేసిన లియామ్ లివింగ్‌స్టోన్.. టాప్ స్కోరర్ అంటే మిగిలిన వారు ఎంత అధ్వాన్నంగా ఆడారో అర్థం చేసుకోవచ్చు. వరల్డ్ క్లాస్ బ్యాటర్లు జో రూట్, బెన్ స్టోక్స్.. కనీసం ఖాతా కూడా తెరవలేకపోయారు.
బ్యాటింగ్‌లో తడబడినప్పటికీ.. టీమిండియా బౌలింగ్ డిపార్ట్‌మెంట్ అద్భుతంగా రాణించింది. బలమైన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ వెన్ను విరిచింది. 129 పరుగులకే కుప్పకూల్చింది. మహ్మద్ షమీ- 4, జస్‌ప్రీత్ బుమ్రా- 3 వికెట్లతో నిప్పులు చెరిగారు. కుల్‌దీప్ యాదవ్-2, రవీంద్ర జడేజా ఒక వికెట్ పడగొట్టారు.
ఇంగ్లాండ్ ఖాతాలో వరుసగా ఇది నాలుగో ఓటమి. అయినప్పటికీ- ఆ జట్టు సెమీ ఫైనల్స్ చేరే అవకాశాలు సజీవంగానే ఉన్నాయి. లీగ్ దశలో ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలివున్న నేపథ్యంలో- ఇంకా ఆశలు పెట్టుకుంది. తన తదుపరి మ్యాచ్‌లల్లో ఇంగ్లాండ్.. ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, పాకిస్తాన్‌తో తలపడాల్సి ఉంది.

ఈ మూడింట్లోనూ గెలిస్తే ఆ జట్టు ఖాతాలో ఎనిమిది పాయింట్లు చేరుతాయి. అదే సమయంలో ప్రస్తుతం ఎనిమిది పాయింట్లతో ఉన్న న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలు ఒక్క మ్యాచ్ కూడా ఇక గెలవకూడదు. దీనితో ఈ మూడు జట్లు కూడా ఎనిమిది పాయింట్ల వద్ద నిలిచిపోతాయి. అప్పుడు బెటర్ నెట్ రన్‌రేట్ ఆధారంగా ఇంగ్లాండ్ సెమీస్ చేరే అవకాశాలు ఉన్నాయి.
బెటర్ రన్‌రేట్‌తో నెగ్గాలంటే మిగిలిన మూడింట్లోనూ ఇంగ్లాండ్ ఆకాశమే హద్దుగా చెలరేగాల్సి ఉంటుంది. సాధారణ రన్‌రేట్‌తో గెలిచినా సెమీస్ అవకాశాలు చేజారినట్టే. నెదర్లాండ్స్‌ను పక్కన పెట్టి చూసినా.. బలమైన ఆస్ట్రేలియాతో పాటు పాకిస్తాన్‌పై భారీ రన్‌రేట్‌తో గెలవడం అనేది ఇంగ్లాండ్‌కు దాదాపు అసాధ్యమే.