PAK vs SA: ఐసీసీ ప్రపంచకప్ 2023లో ఆసక్తికరమైన మ్యాచ్ కొనసాగుతోంది. వరుస విజయాలతో దూసుకెళ్తోన్న దక్షిణాఫ్రికాతో ఢీకొడుతోంది పాకిస్తాన్. చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. ఈ రెండు జట్లకూ కీలకమైన గేమ్ ఇది.
పాకిస్తాన్‌కు డు ఆర్ డై మ్యాచ్ ఇది. ఇందులో గెలిస్తేనే ఆ జట్టు సెమీ ఫైనల్స్ చేరడానికి కొద్దో, గొప్పో అవకాశాలు ఉంటాయి. ఓడిందంటే మాత్రం పెట్టే బేడా సర్దుకోక తప్పదు. ఇప్పటివరకు ఆడిన అయిదు మ్యాచ్‌లల్లో బాబర్ ఆజమ్ సేన గెలిచింది రెండింట్లోనే. వరుసగా మూడు మ్యాచ్‌లల్లో పరాజయాన్ని చవి చూసింది. హ్యాట్రిక్ ఓటములను మూటగట్టుకుంది.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్.. తడబడుతోంది. భారీగా పరుగులు చేయడంలో మరోసారి విఫలమైంది. దక్షిణాఫ్రికా బౌలర్ల ముందు చేతులెత్తేసింది. 31 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది పాకిస్తాన్. కేప్టెన్ బాబర్ ఆజమ్ మినహా మిగిలిన వారెవరూ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిల్చోలేకపోతున్నారు.
అబ్దుల్లా షఫిక్- 9, ఇమామ్-ఉల్ హక్- 12 పరుగులు చేసి మార్కో జన్‌సెన్ బౌలింగ్‌లో వెనుదిరిగారు. కేప్టెన్ బాబర్ ఆజమ్- 50, వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్- 31, ఇఫ్తికర్ అహ్మద్- 21 అవుట్ అయ్యారు. ప్రస్తుతం సవూద్ షకీల్- 14, షాదబ్ ఖాన్-4 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. తబ్రేజ్ షాంసీ-2, గెరాల్డ్ కోయెట్జీ ఒక వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్‌లో బాబర్ ఆజమ్ అవుట్ అయిన తీరు.. ఆశ్చర్యపరిచింది. 65 బంతుల్లో సరిగ్గా 50 పరుగులు చేసినప్పుడు తబ్రేజ్ షాంసీ బౌలింగ్‌లో అతను అవుట్ అయ్యాడు. 28వ ఓవర్ అయిదో బంతికి వికెట్ కీపర్ క్వింటన్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అతని ఇన్నింగ్‌కు తెరపడింది.
తొలుత అంపైర్ అవుట్ ఇవ్వడానికి నిరాకరించాడు. దక్షిణాఫ్రికా కేప్టెన్ టెంబా బావుమా రివ్యూ తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. షార్ప్ రివ్యూ అది. లెగ్ స్టంప్ మీద పడిన బంతిని స్వీప్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు బాబర్. టైమింగ్ మిస్ అయ్యాడు. గ్లోవ్స్‌కు బంతి తగిలి ఉండదని అందరూ భావించారు.
బావుమా మాత్రం రివ్యూ కోరాడు. ఈ విషయంలో ఏ మాత్రం మరో ఆలోచన చేయలేదతను. రివ్యూలో బంతి గ్లోవ్స్‌కు తాకినట్టుగా తేలింది. రివ్యూ సమయంలో ఓ చిన్న స్పైక్ మాత్రమే కనిపించింది. ఇలా అవుట్ కావడం చివరికి- బాబర్ ఆజమ్‌ను కూడా బిత్తరపోయేలా చేసింది. దీన్ని నమ్మలేనన్నట్లుగా వెనుదిరిగాడు.