Quinton De Kock: ఐసీసీ ప్రపంచ కప్ 2023 ఫైనల్స్‌లో భారత్‌ను ఢీ కొట్టే ప్రత్యర్థి ఎవరనేది తేలిపోయింది. రెండో సెమీ ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాను చిత్తుచేసింది ఆస్ట్రేలియా. ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. ఈ నెల 19వ తేదీన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్స్‌లో భారత్‌తో తలపడుతుంది.
కోల్‌కతలోని ఈడెన్ గార్డెన్స్‌లో గురువారం రాత్రి జరిగిన సెమీస్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 49.4 ఓవర్లల్లో 212 పరుగులకు ఆలౌట్ అయింది. మిడిలార్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ సెంచరీ 101తో జట్టును ఆదుకోవడం వల్ల ఆ కాసిన్ని పరుగులైన చేయగలిగింది దక్షిణాఫ్రికన్లు.

అనంతరం బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 47.2 ఓవర్లల్లో ఈ లక్ష్యాన్ని ఛేదించింది. ఏడు వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ఈ విజయంతో ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. ఈ ఆదివారం అహ్మదాబాద్‌లో ఫైనల్స్‌లో భారత్‌ను ఢీకొడుతుంది. ఈ మ్యాచ్ కోసం నరేంద్ర మోదీ స్టేడియం సిద్ధమైంది.
ఇది- దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ (Quinton De Kock)కు చివరి వన్డే ఇంటర్నేషనల్. ఇక వన్డేల్లో కనిపించడీ డాషింగ్ ఓపెనర్. టెస్ట్ మ్యాచ్‌లు, టీ20 ఇంటర్నేషనల్స్‌లో కొనసాగుతాడు. ఐపీఎల్ వంటి టోర్నమెంట్లల్లో ఆడటానికి వీలుగా వన్డేలకు గుడ్ బై చెప్పాడు. వరల్డ్ కప్ ఆరంభానికి ముందే ఈ ప్రకటన చేశాడు.
ఈ వరల్డ్ కప్‌లో డికాక్ ఏ రేంజ్‌లో ఆడాడో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. టోర్నమెంట్‌లో హయ్యెస్ట్ స్కోరర్‌గా నిలిచాడు. లీగ్స్ దశలో 591 పరుగులు చేశాడు. నాలుగు సెంచరీలు ఉన్నాయి. హాఫ్ సెంచరీలు.. జీరో. అర్ధ సెంచరీలన్నింటినీ అతను సెంచరీలుగా మార్చుకున్నట్టయింది. సెమీ ఫైనల్స్‌లో విఫలం అయ్యాడు. మూడు పరుగులతోనే సరిపెట్టుకున్నాడు. మొత్తంగా 594 పరుగులు చేశాడు.
ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డ్ నెలకొల్పాడు డికాక్. ఒకే వరల్డ్ కప్‌లో 500లకు పైగా పరుగులు చేయడంతో పాటు 20 మందిని అవుట్ చేసిన ఏకైక వికెట్ కీపర్ అతనొక్కడే. ఈ రికార్డ్ అటు మహేంద్ర సింగ్ ధోనీ గానీ.. ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ వల్ల గానీ సాధ్యం కాలేదు. వికెట్ కీపర్‌గా ఉంటూ 594 పరుగులు చేసిన బ్యాటర్ వరల్డ్ కప్‌లో మరొకరు లేరు.