PAK vs SA: ఐసీసీ ప్రపంచకప్ 2023లో ఆసక్తికరమైన మ్యాచ్ కొనసాగుతోంది. వరుస విజయాలతో దూసుకెళ్తోన్న దక్షిణాఫ్రికాతో ఢీకొడుతోంది పాకిస్తాన్. చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. ఈ రెండు జట్లకూ కీలకమైన గేమ్ ఇది.
పాకిస్తాన్‌కు డు ఆర్ డై మ్యాచ్ ఇది. ఇందులో గెలిస్తేనే ఆ జట్టు సెమీ ఫైనల్స్ చేరడానికి కొద్దో, గొప్పో అవకాశాలు ఉంటాయి. ఓడిందంటే మాత్రం పెట్టే బేడా సర్దుకోక తప్పదు. ఇప్పటివరకు ఆడిన అయిదు మ్యాచ్‌లల్లో బాబర్ ఆజమ్ సేన గెలిచింది రెండింట్లోనే. వరుసగా మూడు మ్యాచ్‌లల్లో పరాజయాన్ని చవి చూసింది. హ్యాట్రిక్ ఓటములను మూటగట్టుకుంది.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్.. తడబడుతోంది. భారీగా పరుగులు చేయడంలో మరోసారి విఫలమైంది. దక్షిణాఫ్రికా బౌలర్ల ముందు చేతులెత్తేసింది. 36 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది పాకిస్తాన్. కేప్టెన్ బాబర్ ఆజమ్ మినహా మిగిలిన వారెవరూ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిల్చోలేకపోతున్నారు.
అబ్దుల్లా షఫిక్- 9, ఇమామ్-ఉల్ హక్- 12 పరుగులు చేసి మార్కో జన్‌సెన్ బౌలింగ్‌లో వెనుదిరిగారు. కేప్టెన్ బాబర్ ఆజమ్- 50, వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్- 31, ఇఫ్తికర్ అహ్మద్- 21 అవుట్ అయ్యారు. ప్రస్తుతం సవూద్ షకీల్- 36, షాదబ్ ఖాన్-27 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. తబ్రేజ్ షాంసీ-2, గెరాల్డ్ కోయెట్జీ ఒక వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్‌లో బాబర్ ఆజమ్ కాస్త గట్టిగానే ఆడాడు. 65 బంతుల్లో ఒక సిక్సర్, నాలుగు ఫోర్లతో సరిగ్గా 50 పరుగులు చేశాడు. తబ్రేజ్ షాంసీ బౌలింగ్‌లో వికెట్ కీపర్ క్వింటన్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ టోర్నమెంట్‌లో బాబర్ ఆజమ్ చేసిన మూడో హాఫ్ సెంచరీ ఇది. జట్టు ఇన్నింగ్‌కు కొంత వరకు ఊపిరి పోసింది అతని ఇన్నింగ్.
తబ్రేజ్ షాంసీ బౌలింగ్‌లో బాబర్ ఆజమ్.. ఓ ఫ్రీ హిట్‌ను మిస్ అయ్యాడు. భారీ షాట్ ఆడబోయాడు గానీ నిరాశపరిచాడు. ఆ ఫ్రీ- హిట్‌ను బౌండరీగా మలచలేకపోయాననే అసహనం అతని ముఖంలో స్పష్టంగా కనిపించింది. తన ఆగ్రహాన్ని, అసహనాన్ని అతను దాచుకోలేకపోయాడు. ఆ తరువాత అతను ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ బాబర్ అసహనానికి అద్దంపట్టింది. ఫ్రీ హిట్‌కు బౌండరీ మిస్ అయిన వెంటనే గట్టిగా అరవడం కనిపించింది.