Babar Azam: ఐసీసీ ప్రపంచకప్ 2023లో రసవత్తరంగా సాగుతోంది. భారత్ దూకుడు కంటిన్యూ అవుతోంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక తన తదుపరి మ్యాచ్‌ను నవంబర్ 2వ తేదీన ముంబైలోని వాంఖెడే స్టేడియంలో ఆడబోతోంది. శ్రీలంకను ఢీకొట్టబోతోంది.
దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది భారత్.. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్. ఏడు సంవత్సరాల తరువాత భారత గడ్డపై అడుగుపెట్టిన ఈ జట్టు తన స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించట్లేదనేది స్పష్టమౌతోంది. పాకిస్తాన్ కంటే ఆఫ్ఘనిస్తాన్ అద్భుతంగా ఆడుతోంది. పెద్ద జట్లను సైతం బెంబేలెత్తిస్తోంది.

పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ కంటే మెరుగ్గా ఉంది ఆఫ్ఘన్ జట్టు. మూడు విజయాలు- ఆరు పాయింట్లతో అయిదో స్థానంలో నిలిచింది. పాక్ మాత్రం రెండు విజయాలు- నాలుగు పాయింట్లకే పరిమితమైంది ప్రస్తుతానికి. పాయింట్ల పట్టికలో ఈ జట్టు స్థానం.. ఏడు. వరల్డ్ కప్ 2023 సెమీ ఫైనల్స్ చేరాలంటే మిగిలిన మ్యాచ్‌లన్నింటినీ భారీ తేడాతో నెగ్గాల్సి ఉంటుంది బాబర్ ఆజమ్ సేనకు.
ఈ పరిస్థితుల్లో నేడు బంగ్లాదేశ్‌ను ఎదుర్కొనబోతోంది. కోల్‌కతలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఈ మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. ఇప్పటికే రెండు జట్లూ కోల్‌కతకు వచ్చాయి. నెట్ ప్రాక్టీస్‌లో కఠోరంగా శ్రమించాయి. ఈ రెండు జట్లకూ గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది. గెలిస్తేనే సెమీస్ వైపు అడుగులు వేయగలుగుతాయి.

భోజనం చేయడానికి పాకిస్తాన్ జట్టు కోల్‌కతలో బయటికి ఎక్కడికీ వెళ్లట్లేదు. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్ ద్వారా టాప్ హోటళ్ల నుంచి తనకు కావాల్సిన భోజనాన్ని తెప్పించుకుంటోంది. ఇక్కడ ఉన్నన్ని రోజులూ ఆన్‌లైన్ ద్వారా ఫుడ్‌ను తెప్పించుకోవడానికే ప్రాధాన్యత ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయించింది.

రాత్రి కోల్‌కతలోని ఫేమస్ జమ్ జమ్ రెస్టారెంట్ నుంచి భోజనాన్ని తెప్పించుకున్నారు పాకిస్తాన్ ప్లేయర్లు. ఇందులో బిర్యానీ, కబాబ్స్, ఛాప్, షాహీ టుక్డా.. వంటి ఆర్డర్లు తమకు అందినట్లు జమ్ జమ్ రెస్టారెంట్ డైరెక్టర్ షాద్మన్ ఫయీజ్ తెలిపారు. పాకిస్తాన్ క్రికెట్ టీమ్ నుంచి తమకు ఆర్డర్ అందిందనే విషయం మొదట్లో తమకు తెలియదని, బిల్లింగ్ సమయంలో ఆ విషయం తెలిసిందని చెప్పారు. పాకిస్తాన్ జట్టు తమ రెస్టారెంట్ నుంచి ఫుడ్‌ను ఆర్డర్ చేసుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.