బెంగళూరు: ఐసీసీ ప్రపంచకప్ 2023 రసవత్తరంగా కొనసాగుతోంది. టోర్నమెంట్ గ్రూప్ దశ ముగింపు దశకు చేరుకుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మినహా అన్ని జట్లు కూడా ఏడేసి చొప్పున మ్యాచ్‌లను ఆడాయి. ఆయా జట్ల చేతిలో మిగిలివున్నవి ఇంక రెండు చొప్పున మ్యాచ్‌లే.
అయినప్పటికీ.. ఏ జట్టు సెమీ ఫైనల్స్‌కు చేరే జట్లపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటివరకు రోహిత్ సేన ఒక్కటే సెమీ ఫైనల్స్‌లో అడుగు పెట్టింది. సెమీ ఫైనల్స్‌లో టీమిండియాను ఢీ కొట్టగలిగే ప్రత్యర్థులెవరనే విషయంపై ఇంకా స్పష్టత రావట్లేదు. నెదర్లాండ్స్‌పై ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించిన తరువాత- ఇది మరింత క్లిష్టమైంది.

ఈ పరిస్థితుల్లో మరో కీలక మ్యాచ్. పాకిస్తాన్‌తో న్యూజిలాండ్ తలపడబోతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దీనికి వేదిక. ఈ రెండు జట్లకూ ఇది కీలకమైనదే.. న్యూజిలాండ్‌కు మరింత. గెలిచి తీరాల్సిన గేమ్ ఇది. టోర్నమెంట్ ఆరంభంలో వరుస విజయాలను సాధిస్తూ ఆ తరువాత చతికిలపడ్డ బ్లాక్ క్యాప్స్.. తమ సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకోవాలంటే ఇదొక్కటీ గెలిస్తే చాలు.
తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు పాకిస్తాన్ కేప్టెన్ బాబర్ ఆజమ్. నలుగురు ఫాస్ట్ బౌలర్లను తీసుకున్నట్లు తెలిపాడు. పిచ్ స్పిన్నర్ల కంటే కూడా పేసర్లకు అనుకూలిస్తోండటం వల్ల నలుగురికి తుదిజట్టులో చోటు కల్పించామని వివరించాడు. ఉసామా మిర్ స్థానంలో హసన్ అలీని జట్టులోకి తీసుకున్నట్లు చెప్పాడు.
గాయాల వల్ల మొన్నటివరకు జట్టుకు దూరంగా ఉంటూ వచ్చిన కెేన్ విలియమ్సన్.. ఈ మ్యాచ్ ఆడుతున్నాడు. జట్టులోకి తిరిగి వచ్చాడు. జట్టు కేప్టెన్సీ పగ్గాలను అందుకున్నాడు. గాయపడ్డ మ్యాట్ హెన్రీకి బదులుగా ఈష్ సోధిని తుదిజట్టులోకి తీసుకుంది న్యూజిలాండ్. టిమ్ సౌథీనీ కొనసాగిస్తోంది.
పాకిస్తాన్ తుదిజట్టులో- అబ్దుల్లా షఫీక్, ఫకర్ జమాన్, బాబర్ ఆజమ్ (కేప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సవూద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, అఘా సల్మాన్, హసన్ అలీ, షహీన్ షా అఫ్రిది, మహ్మద్ వసీం, హ్యారిస్ రవూఫ్ ఆడుతున్నారు.
న్యూజిలాండ్ తుదిజట్టులో- డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ (కేప్టెన్), డారిల్ మిఛెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ ఛాప్‌మన్, మిఛెల్ శాంట్నర్, ఈష్ సోధి, టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్ చోటు దక్కించుకున్నారు.