ముంబై: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్ రసవత్తర స్థాయికి చేరుకుంది. 70 శాతం టోర్నమెంట్ ముగిసినట్టే. పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఏడు, మిగిలిన జట్లు ఆరు చొప్పున మ్యాచ్‌లు ఆడాయి. అయినప్పటికీ- ఏ జట్టు సెమీ ఫైనల్స్ చేరుకుంటుందనేది ఖరారు కావాట్లేదు. ఒక్క టీమిండియా మినహా అన్ని జట్లూ పరాజయాలను చవి చూసినవే కావడం ఆసక్తికరంగా మారింది.
నేడు దక్షిణాఫ్రికా- న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ మధ్యాహ్నం 2 గంటలకు పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. ప్రస్తుతం ఈ రెండు జట్లు కూడా టాప్ 4లో ఉంటోన్నాయి. ఆరు మ్యాచ్‌లల్లో అయిదు విజయాలతో 10 పాయింట్లతో దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టిలో రెండో స్థానంలో నిలిచింది.

ఆరు మ్యాచ్‌లల్లో నాలుగు విజయాలు- ఎనిమిది పాయింట్లతో న్యూజిలాండ్ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇక ఈ రెండు జట్లూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోన్నాయి. ఏ జట్టు గెలిచినా టాప్ 4లోనే కొనసాగుతాయి. నెట్ రన్‌రేట్ ఆధారంగా వాటి స్థానాలు మారే అవకాశం ఉందంతే.
గ్రూప్ దశలో ఆరు మ్యాచ్‌లు ముగిసిన నేపథ్యంలో ఐసీసీ- ది బెస్ట్ ఫీల్డర్ కేటగిరీని ప్రకటించింది. ఈ కేటగిరీలో న్యూజిలాండ్‌కు చెందిన మిఛెల్ శాంట్నర్ అగ్రస్థానంలో ఉన్నాడు. బంగ్లాదేశ్‌పై జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఫీల్డింగ్ చేశాడు శాంట్నర్. కళ్లు మూసి తెరిచేలోగా ఓ అద్భుత క్యాచ్‌ను అందుకున్నాడు.
కేప్టెన్ హష్మతుల్లా షహీదీని పెవిలియన్ దారి పట్టించడానికి అతను పట్టిన క్యాచ్.. ఇప్పటివరకు ఈ టోర్నమెంట్ మొత్తానికీ హైలైట్‌గా నిలిచింది. జట్టు స్కోరు 43 పరుగుల వద్ద ఉన్నప్పుడు లోకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో హష్మత్ అవుట్ అయ్యాడు. అతను సంధించిన షార్ట్ బంతిని పుల్ షాట్ ఆడాడు హష్మత్.

గాల్లోకి లేచిన ఆ బంతిని శాంట్నర్ అందుకున్న తీరు అద్భుతం. గాల్లోకి లేచిన బంతినే చూస్తూ, ఎడమ వైపునకు డైవ్ చేస్తూ దాన్ని అందుకున్నాడు. ఆ క్యాచ్ మ్యాచ్ మొత్తానికీ హైలైట్ అయింది. అతనికి ది బెస్ట్ ఫీల్డర్‌గా గుర్తింపునిచ్చింది. ఈ కేటగిరీలో 43.28 రేటింగ్స్‌ను ఇచ్చింది ఐసీసీ.
శాంట్నర్ తరువాత డేవిడ్ మిల్లర్- 41.19, డేవిడ్ వార్నర్- 40.82, లియామ్ లివింగ్‌స్టొన్- 34.77, రవీంద్ర జడేజా- 33.72, విరాట్ కోహ్లీ- 33.46, సైబ్రాండ్- 32.56, గ్లెన్ మ్యాక్స్‌వెల్- 28.46, నాజ్ముల్ హొస్సైన్ శాంటో- 28.46, షాదబ్ ఖాన్- 28.44 పాయింట్లతో తొలి 10 స్థానాల్లో నిలిచారు.