ముంబై: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా ఆరు విజయాలతో సెమీ ఫైనల్స్ వైపు దూసుకెళ్తోంది. ఇప్పటివరకు ఓటమి ఎరుగని జట్టుగా నిలిచింది. పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. భారత్ తరువాత దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.
తన తదుపరి మ్యాచ్‌ను నవంబర్ 2వ తేదీన ఆడబోతోంది టీమిండియా. శ్రీలంకను ఎదుర్కొనబోతోంది. ముంబైలోని వాంఖెడె స్టేడియం దీనికి వేదిక. మధ్యాహ్నం 2 గంటలకు ఈ పోరు ఆరంభమౌతుంది. శ్రీలంకపైనా టీమిండియా ఇదే దూకుడును కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ మ్యాచ్ కోసం రెండు జట్లూ ఇప్పటికే ముంబై చేరుకున్నాయి. వాంఖెడే స్టేడియంలో నెట్ ప్రాక్టీస్‌లో గడుపుతున్నాయి. శ్రీలంకపై గెలవడం వల్ల తన సెమీ ఫైనల్స్ బెర్త్‌ను ఖాయం చేసుకోవాలనే పట్టుదల టీమిండియాలో కనిపిస్తోంది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కేప్టెన్ రోహిత్ శర్మ.. ఈ దిశగా జట్టును సమాయాత్తం చేస్తోన్నారు.
శ్రీలంకతో మ్యాచ్‌ను మినహాయిస్తే లీగ్ దశలో ఇంకో రెండు మాత్రమే భారత్ చేతిలో ఉంటాయి. ఈ నెల 5వ తేదీన ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాతో ఒకటి. బెంగళూరు ఎం చిన్నస్వామి స్టేడియంలో నెదర్లాండ్స్‌తో మరో గేమ్ మిగిలివుంటాయి. ఈ రెండింటి గెలుపోటములతో సంబంధం లేకుండా శ్రీలంకపై గెలిచి దర్జాగా సెమీ ఫైనల్స్‌లో అడుగు పెట్టాలని భావిస్తోంది.
సాధారణంగా టీమిండియా మ్యాచ్‌లు ముగిసినప్పుడు పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తూ వస్తోంది బీసీసీఐ. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మాశాల, ఉత్తరప్రదేశ్‌లోని లక్నో స్టేడియాల్లో మ్యాచ్ ముగిసినప్పుడు పెద్ద ఎత్తున క్రాకర్స్‌ను కాల్చిన విషయం తెలిసిందే. కళ్లు మిరుమిట్లు గొలిపేలా ఈ ప్రోగ్రామ్‌ను కండక్ట్ చేస్తోంది.
ఇప్పుడు కూడా రోహిత్ శర్మ హోమ్ పిచ్ ముంబై వాంఖెడే స్టేడియంలోనూ అలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది గానీ.. చివరి నిమిషంలో వెనకడుగు వేసింది. దాన్నీ ఉపసంహరించుకుంది. శ్రీలంకతో మ్యాచ్ ముగిసిన తరువాత ఎలాంటి సెలబ్రేషన్స్ ఉండబోవని బీసీసీఐ తెలిపింది. పటాసులను పేల్చే కార్యక్రమాన్ని నిర్వహించట్లేదని పేర్కొంది.
ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ఓ ప్రకటన విడుదల చేశారు. ముంబైలో ఇప్పటికే కాలుష్యం అధిక మోతాదులో ఉందని, ప్రమాదకర స్థాయికి చేరిందని తెలిపారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రోజురోజుకూ పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో బాణాసంచాను కాల్చడం వల్ల అది మరింత తీవ్రతరమౌతుందని, అందుకే దీన్ని నిర్వహించదలచుకోలేదని అన్నారు.