కోల్‌కత: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తోన్న భారత జట్టుకు బిగ్ షాక్. గాయం బారిన పడ్డ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకొన్నాడు. గాయం నుంచి కోలుకోలేకపోవడం వల్ల అతను జట్టులోకి రీఎంట్రీ ఇవ్వట్లేదు. ఈ విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ వెల్లడించింది.
నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్ నాటికి హార్దిక్ పాండ్యా జట్టుకు అందుబాటులోకి వస్తాడని మొదట్లో అభిప్రాయాలు వ్యక్తం అయినప్పటికీ- అదంతా తలకిందులయింది. గాయం నుంచి పాండ్యా ఇంకా కోలుకోలేదని, ఫిట్ నెస్ పరీక్షల్లో విఫలం అయ్యాడని బీసీసీఐ తెలిపింది. టోర్నమెంట్ నుంచి వైదొలగినట్లు పేర్కొంది.

టీమిండియా తన తదుపరి మ్యాచ్‌ను నవంబర్ 5వ తేదీన ఆడబోతోంది. దక్షిణాఫ్రికాను ఎదుర్కొనబోతోంది. కోల్‌కతని ఈడెన్ గార్డెన్స్ దీనికి వేదిక. మధ్యాహ్నం 2 గంటలకు ఈ పోరు ఆరంభమౌతుంది. శ్రీలంకపైన ప్రదర్శించిన దూకుడు కొనసాగితే దక్షిణాఫ్రికాపై గెలుపు సులువే అవుతుంది.
టీమిండియా సెమీ ఫైనల్స్ బెర్త్ కన్‌ఫర్మ్ అయిన నేపథ్యంలో- హార్దిక్ పాండ్యాను నేరుగా ఆ మ్యాచ్‌లల్లోనే ఆడించాలని టీమ్ మేనేజ్‌మెంట్ తొలుత నిర్ణయించింది. ఆ తరువాత తన నిర్ణయాన్ని మార్చుకుంది. గాయపడి కోలుకున్న తరువాత నేరుగా సెమీ ఫైనల్స్ ఆడించడం కంటే కూడా నెదర్లాండ్స్‌పై ఆడే తుదిజట్టులోకి తీసుకోవాలని భావించింది.
అతను కోలుకోకపోవడంతో అంచనాలన్నీ తలకిందులు అయ్యాయి. హార్దిక్ పాండ్యా స్థానంలో బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణను జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్దారించింది. హార్దిక్ పాండ్యా బదులుగా ప్రసిద్ధ్ కృష్ణను టీమిండియా జట్టులోకి తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది.