సిమ్లా: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో న్యూజిలాండ్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా నాలుగు విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటివరకు ఓటమి ఎరుగని జట్టుగా నిలిచారు బ్లాక్ క్యాప్స్. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆక్రమించారు. న్యూజిలాండ్ తరువాత భారత్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. నాలుగు విజయాలు- ఎనిమిది పాయింట్లు టీమిండియా ఖాతాలో ఉన్నాయి.
తన తదుపరి మ్యాచ్ నేడు ఆడబోతోంది టీమిండియా. బలమైన న్యూజిలాండ్‌ను ఎదుర్కొనబోతోంది. మధ్యాహ్నం 2 గంటలకు హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల స్టేడియంలో ఈ పోరు ఆరంభమౌతుంది. ఈ రెండు జట్లకూ ఇది అయిదో మ్యాచ్. ఓటమి అనేది ఎరుగవు ఈ రెండు జట్లు కూడా.

వరల్డ్ కప్ 2023లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లనూ గెలిచాయి. చెరో ఎనిమిది పాయింట్లతో పాయింట్ల పట్టిలో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. న్యూజిలాండ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. నెట్ రన్‌రేట్ ఆధారంగా భారత్ రెండోస్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆరు పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉన్నాయి.
న్యూజిలాండ్ బౌలింగ్ వెన్నెముక ట్రెంట్ బౌల్ట్. అతని బౌలింగ్‌లో రోహిత్ శర్మ ప్రతీసారీ విఫలమౌతూ వచ్చాడు. పరుగులు చేయడానికి కష్టపడ్డాడు. భారీ షాట్లతో ఇతర బౌలర్లపై సునామీలా విరుచుకుపడే రోహిత్ శర్మ.. ట్రెంట్ బౌల్ట్ అంటే మాత్రం ఒళ్లు దగ్గరపెట్టుకుని మరీ ఆడతాడు.
దీనికి నిదర్శనం- అతను ఆడిన ఇన్నింగ్సే. ఇప్పటివరకు 13 ఇన్నింగ్‌లల్లో బౌల్ట్ బౌలింగ్‌ను ఎదుర్కొన్నాడు రోహిత్ శర్మ. 89 పరుగులు మాత్రమే చేశాడు. నాలుగు సార్లు తన వికెట్‌ను అతనికి సమర్పించుకున్నాడు. అతని బౌలింగ్‌లో ఇప్పటివరకు 11 బౌండరీలు మాత్రమే కొట్టగలిగాడీ హిట్ మ్యాన్.
13 ఇన్నింగ్‌లల్లో ఇన్నింగ్‌కు ఒకటి చొప్పున కూడా బౌండరీ బాదలేకపోయాడంటే రోహిత్ ఎంతగా అతని బౌలింగ్‌ను ఎదుర్కొనడంలో ఇబ్బందులు పడుతున్నాడనేది అర్థం చేసుకోవచ్చు. బ్యాటింగ్ యావరేజ్ 22.25 పరుగులు. అంటే బౌల్ట్ బౌలింగ్‌లో సగటున రోహిత్ చేసిన పరుగులు 22. స్ట్రైక్ రేట్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. 64.96గా ఉంది.