సిమ్లా: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో రెండు దిగ్గజాలు తలపడుతున్నాయి. ఇప్పటివరకు ఓటమి చవి చూడని రెండు జట్లూ అవి. ఏ జట్టు ఓడినా.. తొలి ఓటమి అదే అవుతుంది. ఇదో అరుదైన సందర్భంగా చెప్పుకోవచ్చు. వరుస విజయాలను సాధిస్తూ వచ్చిన టీమిండియా తన జైత్రయాత్రను కొనసాగిస్తుందా? లేక.. ఆ ఛాన్స్ న్యూజిలాండ్‌కు దక్కుతుందా? అనేది ఈ రాత్రికి తేలిపోతుంది.
భారత్, న్యూజిలాండ్ జట్లు వరుసగా నాలుగు చొప్పున విజయాలు సాధించాయి. ఇప్పటివరకు ఓటమి ఎరుగని జట్లుగా నిలిచాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆక్రమించాయి. న్యూజిలాండ్ అగ్రస్థానంలో కొనసాగుతోండగా.. భారత్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. నాలుగు విజయాలు- ఎనిమిది పాయింట్లు చొప్పున సాధించాయి. ఈ రెండు జట్లూ.

భారత్ సాధించిన విజయాల్లో టాస్ కీలక పాత్ర పోషించింది. టాస్ ఓడినా, గెలిచినా అది టీమిండియాకే కలిసొచ్చింది. టాస్ గెలిస్తే ఏ మాత్రం ఆలోచన చేయట్లేదు కేప్టెన్ రోహిత్ శర్మ. బౌలింగ్‌ను ఎంచుకుంటోన్నాడు. స్టేడియం ఏదైనా, పిచ్ ఎలాంటిదైనా, తన ప్రత్యర్థి ఎలాంటి వాడైనా లెక్క చేయట్లేదు. సెకెండ్ ఇన్నింగ్ ఆడటానికే మొగ్గు చూపుతున్నాడు.
ఇప్పటివరకు సాధించిన ఈ నాలుగు విజయాలు కూడా సెకెండ్ ఇన్నింగ్‌లో నమోదైనవే. ఈ నెల 8వ తేదీన చెన్నై చెపాక్ స్టేడియంలో మొదలైంది టీమిండియా జైత్రయాత్ర. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. లో- స్కోర్ మ్యాచ్ ఇది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 199 పరుగులకే చాప చుట్టేయగా.. ఈ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది భారత్.
మలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించింది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసింది ఆఫ్ఘన్. ఆ జట్టు నిర్దేశించిన 272 పరుగులను భారత్ అలవోకగా అందుకుంది. ఈ క్రమంలో రెండు వికెట్లనే కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో సెంచరీతో కదం తొక్కాడు కేప్టెన్ ప్లస్ ఓపెనర్ రోహిత్ శర్మ. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. 55 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
మూడో మ్యాచ్‌లో తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌కు చుక్కలు చూపింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 191 పరుగులకే చతికిలపడింది. ఇక్కడా ఛేజింగే. ఈ స్వల్ప లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి కొట్టేసింది. ఏడు వికెట్లతో విజయదుందుభి మోగించింది. నాలుగో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పైనా ఛేజింగ్‌తోనే గెలిచింది భారత్.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ ఎనిమిది వికెట్ల నష్టానికి 256 పరుగులు చేయగా.. దీన్ని ఛేదించింది భారత్. ఈ క్రమంలో మూడు వికెట్లను కోల్పోయింది. విరాట్ కోహ్లీ సెంచరీ చేయడం ఈ మ్యాచ్ హైలైట్. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్.. ఇలా జట్టు మొత్తం సమష్టిగా రాణించింది. ఇప్పుడు న్యూజిలాండ్‌పైనా టాస్ గెలిచి - ఫీల్డింగ్ ఎంచుకున్నాడు రోహిత్ శర్మ. దీని రిజల్ట్ ఎలా ఉండబోతోందనేది రాత్రికి తేలిపోతుంది.