ముంబై: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో న్యూజిలాండ్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా నాలుగు విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటివరకు ఓటమి ఎరుగని జట్టుగా నిలిచారు బ్లాక్ క్యాప్స్. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆక్రమించారు. న్యూజిలాండ్ తరువాత భారత్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. నాలుగు విజయాలు- ఎనిమిది పాయింట్లు టీమిండియా ఖాతాలో ఉన్నాయి.
తన తదుపరి మ్యాచ్ నేడు ఆడబోతోంది టీమిండియా. బలమైన న్యూజిలాండ్‌ను ఎదుర్కొనబోతోంది. మధ్యాహ్నం 2 గంటలకు హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల స్టేడియంలో ఈ పోరు ఆరంభమౌతుంది. ఈ రెండు జట్లకూ ఇది అయిదో మ్యాచ్. ఓటమి అనేది ఎరుగవు ఈ రెండు జట్లు కూడా.

వరల్డ్ కప్ 2023లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లనూ గెలిచాయి. చెరో ఎనిమిది పాయింట్లతో పాయింట్ల పట్టిలో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. న్యూజిలాండ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. నెట్ రన్‌రేట్ ఆధారంగా భారత్ రెండోస్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా మూడో స్థానంలో కొనసాగుతోంది.
ఈ రెండు జట్లు కూడా సెమీ ఫైనల్స్ చేరుకోవడం దాదాపుగా ఖాయమైనట్టే. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప భారత్, న్యూజిలాండ్ సెమీ ఫైనల్స్ రేసు నుంచి తప్పుకోవడం అసాధ్యం. లీగ్ దశలో భారత్ ఇంకో నాలుగు మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది. న్యూజిలాండ్ తరువాత తన తదుపరి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఎదుర్కొంటుంది. ఈ నెల 29వ తేదీన షెడ్యూల్ అయిందీ గేమ్.
దీని తరువాత శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌తో తలపడుతుంది. వరుస ఓటములతో సతమతమౌతోంది ఇంగ్లాండ్. ఆత్మ విశ్వాసాన్ని కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో ఇంగ్లాండ్‌ను ఓడించడానికి టీమిండియాకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాకపోవచ్చు. శ్రీలంక, నెదర్లాండ్స్ కూడా అంతంతమాత్రంగానే పెర్‌ఫార్మ్ చేస్తోన్నాయి.

ఇప్పుడున్న పరిస్థితుల్లో లీగ్ దశలో టీమిండియాను భయపెట్టే జట్టు ఏదైనా ఉందంటే అది దక్షిణాఫ్రికా మాత్రమే. ఆ మ్యాచ్‌లో ఓడిపోయినా కూడా టీమిండియా పెద్దగా నష్టపోవకపోవచ్చు. లీగ్ దశలో ఆడాల్సిన నాలుగు మ్యాచ్‌లల్లో రెండింట్లో నెగ్గినా సెమీ ఫైనల్స్ అవకాశాలు సజీవంగానే ఉంటాయి.

న్యూజిలాండ్ మాత్రం బలమైన జట్లను ఎదుర్కొనాల్సి ఉంది లీగ్ దశలో. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, శ్రీలంకతో ఆడాల్సి ఉంది. ఇప్పటికే ఆ జట్టుకు కావాల్సినంత నెట్ రన్‌రేట్‌ను అందుబాటులో ఉంది. లీగ్ దశలో రెండింట్లో గెలిచినా సెమీ ఫైనల్స్‌లో అడుగు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ రెండింటితో పాటు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలు వరల్డ్ కప్ సెమీస్ చేరుకుంటాయనే అంచనాలు ఉన్నాయి. లీగ్స్‌లో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్, భారత్‌లతో ఆడుతుంది దక్షిణాఫ్రికా. ఎంత లేదనుకున్నా రెండు మ్యాచ్‌లల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి ఆ జట్టుకు.

ఆస్ట్రేలియా కూడా దాదాపుగా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇంకా అయిదు మ్యాచ్‌లు ఆ జట్టు చేతిలో ఉన్నాయి. నెదర్లాండ్స్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లతో తలపడుతుంది. సెమీస్ చేరాలంటే కనీసం మూడింట్లో నెగ్గాల్సి ఉంటుంది. నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌లపై ఆసీస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే- సెమీస్ చేరే అవకాశాలను సజీవంగా ఉంచుకోగలుగుతుంది.
ఈ నాలుగు జట్లు కాదని మరొకటి రేసులోకి రావడం దాదాపుగా అసాధ్యమే అవుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇంగ్లాండ్ ఆడుతున్న తీరు దారుణంగా ఉంటోంది. వరుస ఓటములతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి దిగజారిందా జట్టు. పాకిస్తాన్ ఆటతీరు కూడా దీనికి భిన్నంగా ఏమీ లేదు. ఈ రెండు జట్లూ సెమీస్ రేసులో నిల్చోవాలంటే ఆడే ప్రతి మ్యాచ్‌నూ భారీ తేడాతో నెగ్గాల్సి ఉంటుంది.