సిమ్లా: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో న్యూజిలాండ్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. టీమిండియా ముందు చెతులెత్తేసింది. వరుసగా నాలుగు విజయాలను సాధించిన కివీస్.. భారత్ ముందు మోకరిల్లింది. బలమైన రోహిత్ సేనను కట్టడి చేయడానికి బ్లాక్ క్యాప్స్ పన్నిన వ్యూహాలేవీ ఫలించలేదు.
టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లల్లో 273 పరుగులకు ఆలౌట్ అయింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర- 75, డారిల్ మిఛెల్- 130 పరుగులతో సత్తా చాటారు. కివీస్ ఇన్నింగ్‌లో వారిద్దరిదే భారీ స్కోర్. లేట్‌గా వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో ఎంట్రీ ఇచ్చిన మహ్మద్ షమీ అయిదు వికెట్లతో న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేశాడు.

274 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్ ఆరంభింంచిన భారత్.. మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మొదటి ఓవర్ నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్.. స్కోర్ బోర్డ్‌ను పరుగులెత్తించారు. వారిద్దరూ వెంటవెంటనే అవుట్ అయినప్పటికీ.. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం రాలేదు.
విరాట్ కోహ్లీ మరోసారి భారీ ఇన్నింగ్ ఆడాడు. 95 పరుగులతో చెలరేగాడు. 104 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, రెండు భారీ సిక్సర్లు బాదాడు. మాట్ హెన్రీ బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు కోహ్లీ. హెన్రీ వేసిన బంతిని మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. బంతి బ్యాట్ అంచులను తాకి గాల్లోకి లేచిన బంతి.. ఫిలిప్స్ చేతుల్లో వాలింది. అయిదు పరుగుల తేడాతో సెంచరీ మిస్ కావడం అభిమానులను నిరాశ పరిచింది.
సెంచరీ మిస్ అయినా.. ఈ టోర్నమెంట్‌లో విరాట్ కోహ్లీ రెచ్చిపోయి ఆడుతోండటం ఫ్యాన్స్‌ను ఉత్సాహ పరుస్తోంది. బౌలర్లపై తుఫాన్‌లా విరుచుకుపడుతున్నాడు. చివరి 13 ఇన్నింగ్స్‌లల్లో ఏకంగా 779 పరుగులు చేశాడు. ఒక సెంచరీ, ఎనిమిది అర్ధసెంచరీలు ఉన్నాయి. మూడుసార్లు అజేయుడిగా నిలిచాడు.

చివరి 13 ఇన్నింగ్స్‌లల్లో 82, 77, 67, 72, 66, 26, 34 (నాటౌట్), 1, 85, 55 (నాటౌట్), 16, 103 (నాటౌట్), 95 పరుగులు చేశాడు కోహ్లీ. ఇందులో ఎక్కువశాతం సెకెండ్ ఇన్నింగ్‌లల్లో సాధించినవే. అతని దూకుడు ఇక్కడితో ఆగదనేది స్పష్టమౌతోంది. వరల్డ్ కప్ టోర్నమెంట్ ముగిసే సరికి 1,000 పరుగులను అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఛేజింగ్ సమయంలో విరాట్ కోహ్లీ దూకుడును అడ్డుకోవడం ఎవరి తరం కాదనేది అందరికీ తెలిసిన విషయమే. ఛేజింగ్ అంటే ఇష్టమనే విషయాన్ని కోహ్లీ చాలాసార్లు చెప్పుకొచ్చాడు కూడా. దాన్నే అతను చేతల్లో చూపిస్తోన్నాడు. జట్టును గెలిపించే క్రమంలో బౌలర్లకు చుక్కలు చూపిస్తోన్నాడు.
అందుకే- అతనికి ఓ నిక్ నేమ్ పెట్టారు అనూష్క శర్మ. కోహ్లీని స్టోర్మ్ ఛేజర్గా పేరు పెట్టారు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అవుట్ అయిన వెంటనే అనూష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికరమైన పోస్ట్‌ను షేర్ చేశారు. స్టోర్మ్ ఛేజర్ అని అభివర్ణించారు. దీనికి కోహ్లీ ఫొటోను జత చేశారు.