ముంబై: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో నేడు బిగ్ డే. సెమీ ఫైనల్స్ నేటి నుంచి మొదలు కానున్నాయి. నేడు, రేపు రెండు సెమీ ఫైనల్స్ షెడ్యూల్ అయ్యాయి. తొలి సెమీ ఫైనల్స్‌లో భారత్- న్యూజిలాండ్ తలపడనున్నాయి. దీనికి వేదిక.. ముంబైలోని వాంఖెడే స్టేడియం. ఈ మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.
రెండో సెమీస్ కోల్‌కత ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికా- ఆస్ట్రేలియా మధ్య జరుగుతుంది. 19వ తేదీన గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ షెడ్యూల్ అయింది. ఈ రెండింటిపైనా ఎన్నో అంచనాలు ఉన్నాయి. తొలి సెమీ ఫైనల్స్‌పై ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు, లెజెండరీ ప్లేయర్లు.. తమ అంచనాలను వెల్లడిస్తోన్నారు.

ఇంగ్లాండ్‌లో 2019లో జరిగిన వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్‌లో ఇదే న్యూజిలాండ్ చేతిలో భారత్ పరాజయాన్ని చవి చూసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఏర్పడింది. పైగా ఇలాంటి ఐసీసీ టోర్నమెంట్లల్లో న్యూజిలాండ్‌ను ఓడించిన చరిత్ర టీమిండియాకు ఎప్పుడూ లేదు. ఇది అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. న్యూజిలాండ్ గండాన్ని ఎలా అధిగమిస్తుందనేది ఉత్కంఠతను రేకెత్తిస్తోంది.
ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకించడానికి పలువురు ప్రముఖులు స్టేడియానికి రానున్నారు. ఈ జాబితా పెద్దదే. క్రీడారంగానికి చెందిన ప్రముఖులే కాకుండా పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్ స్టార్ హీరోలు వాంఖెడేకు చేరుకోనున్నారు.
ఈ జాబితాలో సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ ఉన్నారు. దేశీయ పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, ఆయన భార్య ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ ఓనర్ నీతా అంబానీ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించనున్నారు.
ఇంగ్లాండ్‌కు చెందిన మాజీ సాకర్ సూపర్ స్టార్ డెవిడ్ బెక్‌హ్యామ్ సైతం భారత్- కివీస్ సెమీ ఫైనల్స్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. ఈ నేపథ్యంలో- వాంఖెడే స్టేడియానికి భారీ భద్రతను ఏర్పాటు చేశారు. స్టేడియానికి దారి తీసే మార్గాల్లో వాహనాల రాకపోకలను దారి మళ్లించారు.