Virat Kohli: ఐసీసీ ప్రపంచకప్ 2023లో.. భారత జట్టు విజృంభిస్తోంది. తన సత్తా ఏమిటో మరోసారి క్రికెట్ ప్రపంచానికి చాటి చెబుతోంది. ఇప్పటివరకు ఓటమి అంటే తెలియని జట్టు ఏదైనా ఉందంటే అది- టీమిండియానే. సగం టోర్నమెంట్ ముగిసిపోయినప్పటికీ రోహిత్ సేను కొట్టే జట్టు కనిపించట్లేదు.
ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఏవీ టీమిండియా ముందు నిలవలేకపోయాయి. చివరికి న్యూజిలాండ్ సైతం భారత్ ముందు మోకరిల్లక తప్పలేదు. ఈ అయిదు విజయాలు- 10 పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇంకో మ్యాచ్ గెలిస్తే- వరల్డ్ కప్ 2023 సెమీ ఫైనల్ చేరిన మొట్టమొదటి జట్టు ఇదే అవుతుంది.

ప్రతి మ్యాచ్‌లోనూ కేప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్.. తమ ప్రతాపం చూపుతోన్నారు. ఈ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లల్లో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు 354 పరుగులు చేశాడు. ఇందులో- ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఈ ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు ఆడిన చివరి అయిదు మ్యాచ్‌లల్లో వరుసగా.. 85, 55 (నాటౌట్), 16, 103 (నాటౌట్), 95 పరుగులు చేశాడు కోహ్లీ. అతని దూకుడు ఇక్కడితో ఆగదనేది స్పష్టమౌతోంది. వరల్డ్ కప్ టోర్నమెంట్ ముగిసే సరికి 1,000 పరుగులను అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. న్యూజిలాండ్‌పై జరిగిన మ్యాచ్‌లో 95 పరుగుల వద్ద అవుట్ కావడం అభిమానులను నిరాశ పరిచింది.
బ్యాటర్‌గా తిరుగులేని ఆధిపత్యాన్ని చలాయిస్తోన్న విరాట్ కోహ్లీ.. ఇక ఆల్ రౌండర్‌గా ఆవిర్భవించడం ఖాయంగా కనిపిస్తోంది. బ్యాటర్‌గా మాత్రమే కాకుండా- బౌలర్‌గానూ అతను సత్తా చాటడానికి సిద్ధపడుతున్నట్టే. ఈ టోర్నమెంట్‌లోనే పార్ట్ టైమ్ బౌలర్‌గా కోహ్లీ రంగంలోకి దిగొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
దీన్ని బలపరిచేలా- నెట్స్‌లో బౌలర్‌గా కఠోరంగా శ్రమిస్తోన్నాడు కింగ్ కోహ్లీ. సాధారణంగా నెట్స్‌లో సరదాగా బౌలింగ్ చేస్తుంటారు టీమిండియా బ్యాటర్లు. గతంలోనూ కోహ్లీ ఇలా బౌలింగ్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. వాటన్నింటికంటే భిన్నంగా బౌలింగ్‌పై దృష్టి పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
టీమిండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే వద్ద చిట్కాలను తెలుసుకున్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్ వద్ద రిస్ట్ మెళకువలపై చర్చించడం కనిపించింది. గతంలో వన్డే ఇంటర్నేషనల్స్, టీ20లు, ఐపీఎల్‌లో పార్ట్‌టైమ్ బౌలర్‌గా బౌలింగ్ చేసిన అనుభవం కోహ్లీకి ఉంది. వన్డే, టీ20ల్లో ఒకటి చొప్పున, ఐపీఎల్‌లో రెండు వికెట్లను తీసుకున్నాడు.