Virat Kohli: ఐసీసీ ప్రపంచకప్ 2023.. టీమిండియా విజృంభణకు అద్దం పడుతోంది. సత్తా ఏమిటో మరోసారి క్రికెట్ ప్రపంచానికి చాటి చెబుతోంది. ఇప్పటివరకు ఓటమి అంటే తెలియని జట్టు ఏదైనా ఉందంటే అది భారతే. సగం టోర్నమెంట్ అయినపోయినప్పటికీ టీమిండియాను కొట్టే జట్టే లేదు.
ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఏవీ టీమిండియా ముందు నిలవలేకపోయాయి. చివరికి న్యూజిలాండ్ సైతం భారత్ ముందు మోకరిల్లక తప్పలేదు. ఈ అయిదు విజయాలు- 10 పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇంకో మ్యాచ్ గెలిస్తే- వరల్డ్ కప్ 2023 సెమీ ఫైనల్ చేరిన మొట్టమొదటి జట్టు ఇదే అవుతుంది.

ప్రతి మ్యాచ్‌లోనూ కేప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్.. తమ ప్రతాపం చూపుతోన్నారు. ఈ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లల్లో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు 354 పరుగులు చేశాడు. ఇందులో- ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఈ ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు ఆడిన చివరి అయిదు మ్యాచ్‌లల్లో వరుసగా.. 85, 55 (నాటౌట్), 16, 103 (నాటౌట్), 95 పరుగులు చేశాడు కోహ్లీ. అతని దూకుడు ఇక్కడితో ఆగదనేది స్పష్టమౌతోంది. వరల్డ్ కప్ టోర్నమెంట్ ముగిసే సరికి 1,000 పరుగులను అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
న్యూజిలాండ్‌పై జరిగిన మ్యాచ్‌లో 95 పరుగుల వద్ద అవుట్ కావడం అభిమానులను నిరాశ పరిచింది. వన్డేల్లో ఇప్పటివరకు 48 సెంచరీలు అందుకున్నాడీ రన్ మెషీన్. సెంచరీల హాఫ్ సెంచరీ అందుకోవడానికి దగ్గరలో ఉన్నాడు. ఈ టోర్నమెంట్ కంప్లీట్ అయ్యేలోగా ఈ కొరత కూడా తీరుతుందనే అంచనాలు అభిమానుల్లో నెలకొని ఉన్నాయి.
టీమిండియా బ్యాటింగ్ లెజెండ్, మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం ఇదే అంచనాలను వ్యక్తం చేశారు. తన 50వ సెంచరీని అందుకోవడానికి కోహ్లీ ఎంతోదూరం లేడని వ్యాఖ్యానించారు. నవంబర్ వవ తేదీన కోల్‌కతలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాపై జరిగే మ్యాచ్‌లో కోహ్లీ 50వ సెంచరీ సాధిస్తాడని జోస్యం చెప్పారు.
నవంబర్ 5వ తేదీన కోహ్లీ బర్త్‌డే. తన బర్త్‌డే సెలబ్రేషన్స్ సందర్భంగా అభిమానులకు అతను ఇచ్చే గిఫ్ట్ ఇదేనని జోస్యం చెప్పారు సునీల్ గవాస్కర్. స్టాండింగ్ ఒవేషన్‌తో అతనికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కోల్‌కత ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారని అన్నారు. సెంచరీల హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడానికి అంతకంటే మంచి తరుణం అతనికి దొరకదని వ్యాఖ్యానించారు.
ఈ నెల 29వ తేదీన ఇంగ్లాండ్‌పై జరిగే మ్యాచ్‌లోనూ కోహ్లీ సెంచరీ అందుకుంటాడనే విషయాన్ని సునీల్ గవాస్కర్ చెప్పకనే చెప్పినట్టయింది. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో ఉన్న వన్డే సెంచరీలు.. 48. ఇంకో రెండు సెంచరీలు చేస్తే గానీ దీన్ని అందుకోలేడతను. ఇంగ్లాండ్‌పై జరిగే మ్యాచ్‌లో 49వ సెంచరీ చేయాల్సి ఉంటుంది.