Rahul Dravid trekking: ఐసీసీ ప్రపంచకప్ 2023.. టీమిండియా విజృంభణకు అద్దం పడుతోంది. సత్తా ఏమిటో మరోసారి క్రికెట్ ప్రపంచానికి చాటి చెబుతోంది. ఇప్పటివరకు ఓటమి అంటే తెలియని జట్టు ఏదైనా ఉందంటే అది భారతే. సగం టోర్నమెంట్ అయినపోయినప్పటికీ టీమిండియాను కొట్టే జట్టే లేదు.
ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఏవీ టీమిండియా ముందు నిలవలేకపోయాయి. చివరికి న్యూజిలాండ్ సైతం భారత్ ముందు మోకరిల్లక తప్పలేదు. ఈ అయిదు విజయాలు- 10 పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇంకో మ్యాచ్ గెలిస్తే- వరల్డ్ కప్ 2023 సెమీ ఫైనల్ చేరిన మొట్టమొదటి జట్టు ఇదే అవుతుంది.

జట్టు ఇంత శతృ దుర్భేధ్యంగా మారడానికి ప్రధాన కారణం.. ఆల్‌రౌండ్ పెర్‌ఫార్మెన్స్. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా ఎందులోనూ తీసిపోవట్లేదు టీమిండియా. బ్యాటర్లు, బౌలర్లు పోటీ పడి రాణిస్తోన్నారు. బ్యాటర్లు స్టేడియంలో పరుగుల వరద పారిస్తోండగా.. బౌలర్లు ప్రత్యర్థిని ఎక్కడికక్కడ కట్టడి చేస్తోన్నారు.
ఇదే ఊపుతో తన తదుపరి మ్యాచ్‌కు రెడీ అవుతోంది టీమిండియా. ఈ నెల 29వ తేదీన ఇంగ్లాండ్‌తో తలపడాల్సి ఉంది. ఉత్తర్ ప్రదేశ్ లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏక్నా స్టేడియం దీనికి వేదిక. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. అతని స్థానంలో పేస్ బౌలర్ మహ్మద్ షమీని కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.
ఈ మ్యాచ్ ఆడటానికి ఇంకా నాలుగురోజుల సమయం ఉంది. ఈ లోగా టీమిండియా ప్లేయర్లందరూ ధర్మశాలలోనే రిలాక్స్ అవుతోన్నారు. న్యూజిలాండ్‌తో మ్యాచ్ ముగిసినప్పటి నుంచీ వారు ఇక్కడే ఉంటోన్నారు. కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. రెండు రోజుల తరువాత అంటే 27 లేదా 28వ తేదీన లక్నోకు బయలుదేరి వెళ్లొచ్చు.
ఈ లాంగ్ బ్రేక్‌ను హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ భలేగా సద్వినియోగం చేసుకున్నాడు. హిమాలయ పర్వతాల్లో ట్రెక్కింగ్‌కు బయలుదేరి వెళ్లాడు. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ రాస్ మాంబ్రే, మెడికల్ టీమ్, ఇతర సపోర్టింగ్ స్టాఫ్‌తో కలిసి ట్రెక్కింగ్‌లో ఉన్నాడు ద్రవిడ్. దీనికి సంబంధించిన ఓ వీడియోను బీసీసీఐ తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై పోస్ట్ చేసింది.
ఈ ట్రెక్కింగ్‌కు వెళ్లడానికి ప్లేయర్లకు అనుమతి ఇవ్వలేదు బీసీసీఐ. డే అవుట్‌కు వెళ్లొచ్చు గానీ, ట్రెక్కింగ్ వెళ్లడానికి రెడ్ సిగ్నల్ ఇచ్చింది. దీనివల్ల శారీరకంగా అలసిపోతారని భావించింది. ధర్మశాలలో ఫేమస్ అయిన పారా గ్లైడింగ్‌కూ అనుమతి ఇవ్వలేదు. ధర్మశాలలో షాపింగ్ లేదా డే అవుట్‌కు వెళ్లడానికి పర్మిషన్ ఉందని, ట్రెక్కింగ్, పారా గ్లైడింగ్ వంటి అడ్వెంచర్స్‌కు వెళ్లొద్దని సూచించింది.