ముంబై: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా ఆరు విజయాలతో సెమీ ఫైనల్స్ వైపు దూసుకెళ్తోంది. ఇప్పటివరకు ఓటమి ఎరుగని జట్టుగా నిలిచింది. పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. భారత్ తరువాత దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.
లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏక్నా స్టేడియంలో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది రోహిత్ సేన. 50 ఓవర్లల్లో తొమ్మిది వికెట్ల నష్టానికి 229 పరుగులే చేయగలిగింది. రోహిత్ శర్మ మరోసారి కేప్టెన్సీ ఇన్నింగ్ ఆడాడు. 87 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్-49, కేఎల్ రాహుల్- 39 పరుగులు చేశారు.

230 పరుగుల టార్గెట్‌తో ఛేజింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ చేతులెత్తేసింది. ప్రారంభం నుంచే తడబడింది. ఏ ఒక్కరు కూడా కుదురుగా క్రీజ్‌లో నిల్చోలేకపోయారు. 27 పరుగులు చేసిన లియామ్ లివింగ్‌స్టోన్.. టాప్ స్కోరర్ అంటే మిగిలిన వారు ఎంత అధ్వాన్నంగా ఆడారో అర్థం చేసుకోవచ్చు. వరల్డ్ క్లాస్ బ్యాటర్లు జో రూట్, బెన్ స్టోక్స్.. కనీసం ఖాతా కూడా తెరవలేకపోయారు.
బ్యాటింగ్‌లో తడబడినప్పటికీ.. టీమిండియా బౌలింగ్ డిపార్ట్‌మెంట్ అద్భుతంగా రాణించింది. బలమైన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ వెన్ను విరిచింది. 129 పరుగులకే కుప్పకూల్చింది. మహ్మద్ షమీ- 4, జస్‌ప్రీత్ బుమ్రా- 3 వికెట్లతో నిప్పులు చెరిగారు. కుల్‌దీప్ యాదవ్-2, రవీంద్ర జడేజా ఒక వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కేప్టెన్ రోహిత్ శర్మ- స్పిన్ బౌలర్ కుల్‌దీప్ యాదవ్ మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్ చోటు చేసుకుంది. రోహిత్ శర్మ.. అతణ్ని గట్టిగా అనడం, దానితో కుల్‌దీప్ యాదవ్ చిన్నబుచ్చుకోవడం కనిపించింది. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
22వ ఓవర్‌లో చోటు చేసుకున్న ఘటన అది. కుల్‌దీప్ యాదవ్ వేసిన బంతి నేరుగా లియామ్ లివింగ్‌స్టొన్ ప్యాడ్లను తాకింది. కుల్‌దీప్ యాదవ్, వికెట్ కీపర్ అప్పీల్ చేసినప్పటికీ.. ఆన్ ఫీల్డ్ అంపైర్ అవుట్ ఇవ్వలేదు. ఆ అవుట్‌పై కుల్‌దీప్ యాదవ్ కాన్ఫిడెంట్‌గా లేడు. రోహిత్ శర్మకూ అదే చెప్పాడు. దీనితో రివ్యూ కోరలేదెవరు.
రీప్లేలో మాత్రం ఆ బంతి వికెట్ల మీదికి వెళ్లినట్లు స్పష్టంగా కనిపించింది. రివ్యూ తీసుకుని ఉంటే మాత్రం లియామ్ లివింగ్‌స్టొన్ అప్పుడే అవుట్ అయ్యేవాడు. అప్పటికీ టీమిండియా వద్ద రెండు రివ్యూలు ఉన్నాయి. డీఆర్ఎస్ కోరే అవకాశం ఉన్నప్పటికీ.. కుల్‌దీప్ యాదవ్ కాన్ఫిడెంట్‌గా లేకపోవడం వల్ల రివ్యూ తీసుకోలేదు.
ఇది కాస్తా రోహిత్ శర్మకు ఆగ్రహాన్ని తెప్పించింది. అసహనానికి గురి చేసింది. బౌలింగ్ ముగిసిన వెంటనే అతను కుల్‌దీప్ యాదవ్ దగ్గరికి వచ్చి.. గట్టిగా అరిచాడు. ఆ సమయంలో రోహిత్ శర్మ తీవ్ర అసహనంలో ఉన్నట్లు కనిపించాడు. ఈ ఆర్గ్యుమెంట్ తరువాత కుల్‌దీప్ యాదవ్ ముఖం చిన్నబుచ్చుకోవడం ఈ వీడియో క్లిప్‌లో కనిపించింది.