ఐసీసీ ప్రపంచ కప్ 2023 ఫైనల్స్‌లో భారత్‌ను ఢీ కొట్టే ప్రత్యర్థి ఎవరనేది తేలిపోయింది. రెండో సెమీ ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాను చిత్తుచేసింది ఆస్ట్రేలియా. ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. ఈ నెల 19వ తేదీన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్స్‌లో భారత్‌తో తలపడుతుంది.
కోల్‌కతలోని ఈడెన్ గార్డెన్స్‌లో గురువారం రాత్రి జరిగిన సెమీస్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 49.4 ఓవర్లల్లో 212 పరుగులకు ఆలౌట్ అయింది. మిడిలార్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ సెంచరీ 101తో జట్టును ఆదుకోవడం వల్ల ఆ కాసిన్ని పరుగులైన చేయగలిగింది దక్షిణాఫ్రికన్లు.

అనంతరం బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 47.2 ఓవర్లల్లో ఈ లక్ష్యాన్ని ఛేదించింది. ఏడు వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ఈ విజయంతో ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. ఈ ఆదివారం అహ్మదాబాద్‌లో ఫైనల్స్‌లో భారత్‌ను ఢీకొడుతుంది. ఈ మ్యాచ్ కోసం నరేంద్ర మోదీ స్టేడియం సిద్ధమైంది.
ఇక ఫైనల్స్‌లో తలపడబోయే భారత తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతోందనేది ఆసక్తి రేపుతోంది. లీగ్స్ దశ నుంచి సెమీ ఫైనల్స్ వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు టీమిండియా. బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ దూకుడు మీద ఉన్నారు.
బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో పేసర్లు ఏ స్థాయిలో రెచ్చిపోతున్నారో తెలిసిందే. జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.. బ్యాటర్లను భయపెడుతున్నారు. లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులను సంధిస్తూ నిప్పులు చెరుగుతున్నారు. రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్ తమ స్పిన్ మాయాజాలంతో బ్యాటర్లను కట్టడి చేస్తోన్నారు.
అటు బ్యాటింగ్, బౌలింగ్ విభాగం సమతూరంగా ఉన్నప్పటిెకీ.. ఒక్కటే లోటు కనిపిస్తోంది టీమిండియాలో. అదే- సూర్యకుమార్ యాదవ్ వరుస వైఫల్యాలు. ఒక్క మ్యాచ్‌లో కూడా తన స్థాయికి తగ్గ ఆటతీరును కనపర్చలేదు ఈ స్టార్ మిడిలార్డర్ బ్యాటర్. వరుస వైఫల్యాలు అతన్ని వెంటాడుతోన్నాయి.
వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లల్లో సూర్యకుమార్ యాదవ్ చేసినవి 89 పరుగులే. 15 పరుగుల సగటు బ్యాటింగ్ యావరేజ్‌ను నమోదు చేశాడు. జట్టుకు భారంగా మారినట్టే కనిపిస్తోంది. ఫైనల్స్‌లో అతన్ని తప్పించే అవకాశాలు లేకపోలేదు. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకోవచ్చనే అంచనాలు ఉన్నాయి.
వరల్డ్ కప్ ఫైనల్ తుదిజట్టులో- రోహిత్ శర్మ (కేప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్/రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్‌దీప్ యాదవ్ ఆడే అవకాశాలు ఉన్నాయి.