Shadab Khan: ఐసీసీ వరల్డ్ కప్ 2023లో ఏ మాత్రం అంచనాలను అందుకోలేకపోయిన జట్లు ఏవైనా ఉన్నాయంటే అవి- ఇంగ్లాండ్, పాకిస్తాన్. నాసిరకం ఆటతీరును ప్రదర్శించాయి ఆ రెండు జట్లూ. అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచాయి. ఈ రెండూ గతంలో వరల్డ్ కప్ ఛాంపియన్‌గా నిలిచినవే.
పాకిస్తాన్ తన స్థాయి తగ్గట్లుగా ఆడలేదు. బ్యాటర్లు, బౌలర్లు సమష్ఠిగా విఫలం అయ్యారు. ఫీల్డింగ్‌లోనూ చెప్పుకోదగ్గ మెరుపులేవీ కనిపించలేదు. ఏ ఒక్క ప్లేయర్‌కు కూడా ఈ వరల్డ్ కప్ 2023 చిరస్మరణీయంగా మారలేదు. అందరికీ చేదు అనుభవాన్ని మిగిల్చింది. పీడకలలా మారింది.

కేప్టెన్ బాబర్ ఆజమ్ మరీ అధ్వాన్నంగా ఆడాడు. తొమ్మిది మ్యాచ్‌లల్లో బాబర్ ఆజమ్ చేసిన స్కోర్ 320 పరుగులే. బంగ్లాదేశ్‌పై చేసిన 74 పరుగులే అత్యధికం. అది కూడా లేకపోయి ఉంటే అతని స్కోరింగ్ నంబరింగ్, స్టాటిస్టిక్స్ మరింత దిగజారిపోయి ఉండేవి. స్ట్రైక్ రేట్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండట్లేదు.
కేప్టెన్‌గా జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపించలేకపోయాడు. ప్లేయర్లల్లో స్ఫూర్తినింపలేకపోయడు. ఇమాముల్ హక్, మహ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, షహీన్ షా అఫ్రిది వంటి ఆటగాళ్లు ప్రత్యర్థుల చేతుల్లో తేలిపోయారు. శ్రీలంకపై మహ్మద్ రిజ్వాన్, న్యూజిలాండ్‌పై ఫఖర్ జమాన్ ఆడిన ఇన్నింగ్స్ మాత్రమే ఫర్వాలేదనిపించాయి.
ఈ పరిణామాలపై జట్టు వైస్ కేప్టెన్ షాదబ్ ఖాన్ స్పందించాడు. వరుస పరాజయాలు పాలుకావడాన్ని విశ్లేషించాడు. జట్టు సమష్ఠిగా విఫలమైందనే విషయాన్ని అంగీకరించాడు. ఎన్నో అంచనాలతో తాము భారత్‌లో అడుగుపెట్టామని, వాటిని అందుకోలేకపోయామని వ్యాఖ్యానించాడు.
ప్రత్యర్థులను ఓడించడానికి సరైన ప్రణాళికలను రూపొందించుకున్నప్పటికీ.. వాటిని అంతే పక్కాగా ఎగ్జిక్యూట్ చేయలేకపోయామని షాదబ్ ఖాన్ వివరించాడు. తన ప్రదర్శన సైతం తీవ్ర నిరాశకు గురి చేసిందని పేర్కొన్నాడు. బౌలర్‌గా తన సామర్థ్యానికి తగ్గట్టుగా తాను రాణించలేకపోయానని అన్నాడు.
జట్టు ప్లేయర్లు మూకుమ్మడిగా విఫలం కావడం తమ గెలుపోటములను ప్రభావితం చేసిందని షాదబ్ ఖాన్ చెప్పాడు. ఏ జట్టయినా టోర్నమెంట్ గెలవడానికి ప్రయత్నిస్తుందని, తమ విషయంలో అలా జరగలేదని అన్నాడు. తాము సెమీఫైనల్‌కు దూరం కావడం పట్ల కోచ్‌లు, ప్లేయర్లు, సపోర్టింగ్ స్టాఫ్.. అందరూ నిరాశకు గురయ్యాడరని పేర్కొన్నాడు.
ఇకపై ఎప్పుడు ఎలాంటి సీరీస్‌లు గానీ, టోర్నమెంట్‌లు గానీ జరిగిప్పుడల్లా.. ఏ ఒక్క డిపార్ట్‌మెంట్‌నో మెరుగుపర్చుకోవడం సరికాదని, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని రంగాలపైనా ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నాడు. ఒక టీమ్‌గా తాము ఆధునిక క్రికెట్‌కు అలవాటుపడలేకపోతున్నామని చెప్పాడు.