Babar Azam: ఐసీసీ వరల్డ్ కప్ 2023లో ఏ మాత్రం అంచనాలను అందుకోలేకపోయిన జట్లు ఏవైనా ఉన్నాయంటే అవి- ఇంగ్లాండ్, పాకిస్తాన్. నాసిరకం ఆటతీరును ప్రదర్శించాయి ఆ రెండు జట్లూ. అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచాయి. ఈ రెండూ గతంలో వరల్డ్ కప్ ఛాంపియన్‌గా నిలిచినవే.
పాకిస్తాన్ తన స్థాయి తగ్గట్లుగా ఆడలేదు. బ్యాటర్లు, బౌలర్లు సమష్ఠిగా విఫలం అయ్యారు. ఫీల్డింగ్‌లోనూ చెప్పుకోదగ్గ మెరుపులేవీ కనిపించలేదు. ఏ ఒక్క ప్లేయర్‌కు కూడా ఈ వరల్డ్ కప్ 2023 చిరస్మరణీయంగా మారలేదు. అందరికీ చేదు అనుభవాన్ని మిగిల్చింది. పీడకలలా మారింది.

కేప్టెన్ బాబర్ ఆజమ్ మరీ అధ్వాన్నంగా ఆడాడు. తొమ్మిది మ్యాచ్‌లల్లో బాబర్ ఆజమ్ చేసిన స్కోర్ 320 పరుగులే. బంగ్లాదేశ్‌పై చేసిన 74 పరుగులే అత్యధికం. అది కూడా లేకపోయి ఉంటే అతని స్కోరింగ్ నంబరింగ్, స్టాటిస్టిక్స్ మరింత దిగజారిపోయి ఉండేవి. స్ట్రైక్ రేట్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండట్లేదు.
కేప్టెన్‌గా జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపించలేకపోయాడు. ప్లేయర్లల్లో స్ఫూర్తినింపలేకపోయడు. ఇమాముల్ హక్, మహ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, షహీన్ షా అఫ్రిది వంటి ఆటగాళ్లు ప్రత్యర్థుల చేతుల్లో తేలిపోయారు. శ్రీలంకపై మహ్మద్ రిజ్వాన్, న్యూజిలాండ్‌పై ఫఖర్ జమాన్ ఆడిన ఇన్నింగ్స్ మాత్రమే ఫర్వాలేదనిపించాయి.
సెమీ ఫైనల్స్ చేరకుండానే తిరుగుముఖం పట్టిన పాకిస్తాన్ జట్లు పట్ల స్వదేశంలో తీవ్ర విమర్శలు వ్యక్తమౌతోన్నాయి. మాజీ క్రికెటర్లు దుమ్మెత్తి పోస్తోన్నారు. వసీం అక్రమ్, షోయబ్ అఖ్తర్.. వంటి మాజీలు ఓ అడుగు ముందుకేశారు. ఫిట్‌నెస్ పట్లా ఘాటు విమర్శలు సంధిస్తోన్నారు.
ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ క్రికెట్ డైరెక్టర్ మిక్కీ అర్థర్.. జట్టుకు అండగా నిలిచాడు. ప్రత్యేకించి- కేప్టెన్ బాబర్ ఆజమ్‌కు తన మద్దతు తెలిపాడు. కేప్టెన్‌గా బాబర్ ఆజమ్ ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడని వ్యాఖ్యానించాడు. ప్రతి రోజూ ఓ కొత్త పాఠాన్ని నేర్చుకుంటోన్నాడని, విమర్శలకు బదులుగా ఎదగడానికి అవకాశం కల్పించాలని అన్నాడు.
బాబర్ ఓ అద్భుతమైన బ్యాటర్ అనే విషయం అందరికీ తెలిసిందేనని, కొన్ని సార్లు వైఫల్యాలు వెంటాడక తప్పవని మిక్కీ అర్థర్ చెప్పాడు. తాను చేసే తప్పులను సరిదిద్దుకుంటూ మరింత రాటుదేలుతాడని అన్నాడు. ఎదురు దెబ్బలు తిన్నప్పుడే జట్టు తన పనితీరును మరింత మెరుగుపర్చుకుంటుందని అభిప్రాయపడ్డాడు.