సిమ్లా: ఐసీసీ ప్రపంచకప్ 2023లో ఆస్ట్రేలియా రెచ్చిపోతోంది. న్యూజిలాండ్‌పై భారీ స్కోర్‌ను సాధించే దిశగా దూసుకెళ్తోంది. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పరుగుల వరద పారిస్తోన్నారు ఆస్ట్రేలియా బ్యాటర్లు. ఈ క్రమంలో ఓపెనర్ ట్రావిస్ హెడ్ సెంచరీ సైతం పూర్తి చేసుకున్నాడు.
టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్‌ను ఎంచుకుంది న్యూజిలాండ్. ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 26 ఓవర్లల్లో రెండు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్- 109, డేవిడ్ వార్నర్- 81 పరుగులతో చెలరేగారు. ఓవర్‌కు తొమ్మిది చొప్పున పరుగులను పిండుకున్నారు. వారిద్దరూ అవుట్ అయిన తరువాత స్కోర్ బోర్డ కొంచెం నెమ్మదించింది.

స్టీవెన్ స్మిత్ 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 35 ఓవర్లల్లో మూడు వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. మిఛెల్ మార్ష్, మార్నుస్ లాంబుషేన్ క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ దూకుడు చూస్తోంటే ఆ జట్టు స్కోర్ బోర్డ్ 350 మార్క్‌ను దాటడం ఖాయంగా కనిపిస్తోంది. తొలిసారిగా కివీస్ బౌలర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోన్నారిక్కడ.
జట్టు భారీ స్కోర్ చేయడానికి గట్టి పునాది వేశారు డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్. కివీస్ బౌలర్లపై రెచ్చిపోయి ఆడాడు. డేవిడ్ వార్నర్ 65 బంతుల్లో ఆరు సిక్సర్లు, అయిదు ఫోర్లతో 81 పరుగులు చేయగా.. ట్రావిస్ హెడ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 67 బంతుల్లో ఏడు భారీ సిక్సర్లు, 10 బౌండరీలతో 109 పరుగులు సాధించాడు.
ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బౌలర్ మిఛెల్ శాంట్నర్ రెండు వికెట్లు పడగొట్టాడు. మిఛెల్ మార్ష్, మార్నుస్ లాంబుషేన్‌ను పెవిలియన్ దారి పట్టించాడు. వికెట్లు తీసుకున్నప్పటికీ.. భారీగా పరుగులను సమర్పించుకున్నాడు శాంట్నర్. తన 10 ఓవర్ల కోటాలో ఏకంగా 80 పరుగులు ఇచ్చుకున్నాడు.
36 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మిఛెల్ మార్ష్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. శాంట్నర్ సంధించిన గుడ లెంగ్త్ బంతిని ఆడటంలో తడబడ్డాడు మార్ష్. బ్యాక్ ఫుట్ మీద డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. అప్పటికే లేట్ అయింది. బంతి వికెట్లను గిరాటేసింది. వికెట్లకు కాస్త దూరంగా విసిరిన బంతిని భారీ షాట్ ఆడబోయిన లాంబుషేన్.. డీప్ మిడ్ వికెట్‌లో రచిన్ రవీంద్రకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఈ రెండు వికెట్లతో మిఛెల్ శాంట్నర్.. వరల్డ్ కప్ 2023లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లను పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు. 14 వికెట్లను నేలకూల్చాడీ స్పిన్ బౌలర్. ఆరు మ్యాచ్‌లల్లో 14 వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్ అయ్యాడు. ఇంకా ఆడాల్సిన మ్యాచ్‌లు మిగిలే ఉన్న నేపథ్యంలో ఈ సంఖ్యను మరింత మెరుగుపర్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.