Glenn Maxwell: ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో మార్మోగిపోతున్న పేరు.. గ్లెన్ మ్యాక్స్‌వెల్. అసలే మ్యాడ్ మ్యాక్సీ అనే పేరుందతనికి. వెనుకాముందు చూడకుండా బౌలర్లను ఉతికి ఆరేస్తాడని, విచక్షణారహితంగా ఊచకోతకు దిగుతుంటాడనీ అంటుంటారు ఫ్యాన్స్. అలాంటిది- తన జట్టు ఓటమి అంచుల్లో ఉన్నప్పుడు ఇక ఎలా ఆడతాడనేది ఓ ఊహగా ఉంటూ వచ్చింది. ఇప్పుడది నిజమైంది.
91 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పతనం అంచుల్లో నిలిచిన జట్టును గెలిపించడం అంటే మాటలు కాదు.. అది కూడా లోయర్ ఆర్డర్ బ్యాటర్ల సహకారంతో. ఓటమి తప్పదనుకున్న దశ నుంచి జట్టును గెలిపించాడు మ్యాక్స్‌వెల్. విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. ఎనిమిదో వికెట్‌కు అజేయంగా 202 పరుగులు జోడించాడు.

నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో కేప్టెన్ పాట్ కమ్మిన్స్ సమయోచితంగా ఆడటం కూడా మ్యాక్స్‌వెల్‌కు కలిసొచ్చింది. వికెట్ పడకుండా తనను తాను కాపడుెకోగలిగాడు కమ్మిన్స్. ఈ క్రమంలో అతను ఏకంగా 68 బంతులను ఎదుర్కొన్నాడు. చేసింది 12 పరుగులే అయినప్పటికీ.. వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు.
మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్‌లో 10 భారీ సిక్సర్లు, 21 ఫోర్లు.. అతని సునామీ ఇన్నింగ్‌కు అద్దం పట్టాయి. 128 బంతుల్లో 157.03 స్ట్రైక్ రేట్‌తో 201 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతని కాలికి గాయమైనప్పటికీ.. ఓర్చుకున్నాడు. గెలుపే లక్ష్యంగా ఆడాడు. ఒంటికాలిపైనే శివాలెత్తాడు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించడం అనే పదాలకు అసలు సిసలు నిర్వచనం ఇచ్చాడు.
గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్.. అటు రికార్డ్ వ్యూవర్‌షిప్‌ను సాధించింది. అతను ఆడుతున్నప్పుడు ఏకంగా 2.6 కోట్ల వ్యూవర్‌షిప్‌ను నమోదు చేసింది హాట్‌స్టార్. ఈ వరల్డ్ కప్‌లో ఓ నాన్ ఇండియా మ్యాచ్‌కు ఈ స్థాయిలో ఆదరణ లభించడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇదివరకు కోల్‌కత ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాపై జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఇన్నింగ్‌ను 4.4 కోట్ల మంది చూశారు. అది ఓవరాల్ రికార్డ్. ఇప్పటివరకు హాట్‌స్టార్ చరిత్రలోనే ఈ స్థాయిలో వ్యూవర్‌షిప్ నమోదు కాలేదు. అదే సమయంలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ బ్యాటింగ్‌ను 2.6 కోట్ల మందికి పైగా తిలకించారు. ఇది నాన్ ఇండియా మ్యాచ్‌లల్లో హయ్యెస్ట్ రికార్డ్.