Glenn Maxwell injury: ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అలియాస్ మ్యాడ్ మ్యాక్సీ మరోసారి సత్తా చాటాడు. ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. 91 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పతనం అంచుల్లో నిలిచిన జట్టును గెలిపించడానికి విధ్వంసకరమైన ఇన్నింగ్ ఆడాడు. ఎనిమిదో వికెట్‌కు అజేయంగా 202 పరుగులు జోడించాడు.
నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో కేప్టెన్ పాట్ కమ్మిన్స్ సమయోచితంగా ఆడటం కూడా మ్యాక్స్‌వెల్‌కు కలిసొచ్చింది. వికెట్ పడకుండా తనను తాను కాపడుెకోగలిగాడు కమ్మిన్స్. ఈ క్రమంలో అతను ఏకంగా 68 బంతులను ఎదుర్కొన్నాడు. చేసింది 12 పరుగులే అయినప్పటికీ.. వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు.

మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్‌లో 10 భారీ సిక్సర్లు, 21 ఫోర్లు.. అతని సునామీ ఇన్నింగ్‌కు అద్దం పట్టాయి. 128 బంతుల్లో 157.03 స్ట్రైక్ రేట్‌తో 201 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతని కాలికి గాయమైనప్పటికీ.. ఓర్చుకున్నాడు. గెలుపే లక్ష్యంగా ఆడాడు. ఒంటికాలిపైనే శివాలెత్తాడు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించడం అనే పదాలకు అసలు సిసలు నిర్వచనం ఇచ్చాడు.
కాలి గాయంతోనే అతను ఈ స్థాయిలో విజృంభించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రన్ తీసే సమయంలో అతని కాలి పిక్కలు పట్టేశాయి. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితిని ఎదుర్కొన్నాడు. క్రీజ్‌లో సరిగ్గా నిల్చోలేకపోయాడు. సరైన ఫుట్ వర్క్ లేనప్పటికీ.. తనదైన శైలిలో షాట్లు ఆడాడు.
ఈ మ్యాచ్ అనంతరం అందరి దృష్టీ గ్లెన్ మ్యాక్స్‌వెల్ గాయం (Glenn Maxwell injury) తీవ్రతపై పడింది. ఆస్ట్రేలియా సెమీ ఫైనల్స్‌కు చేరిన ప్రస్తుత పరిస్థితుల్లో అతను జట్టుకు అందుబాటులో ఉంటాడా? ఉండడా? అనేది చర్చనీయాంశమౌతోంది. పైగా ఆసీస్ గ్రూప్ దశలో మరో మ్యాచ్‌ను ఆడాల్సి ఉంది. 11వ తేదీన పుణేలో బంగ్లాదేశ్‌తో తలపడుతుంది ఆసీస్. దీని తరువాత సెమీ ఫైనల్స్ కోసం సన్నద్ధం కావాల్సి ఉంటుందా జట్టుకు.
ఈ పరిస్థితుల్లో మ్యాక్స్‌వెల్ గాయంపై ఆ జట్టు కేప్టెన్ పాట్ కమ్మిన్స్ (Pat Cummins) అప్‌డేట్ ఇచ్చాడు. మ్యాక్సీ గాయంపై పెద్దగా ఆందోళన చెందట్లేదని తేల్చి చెప్పాడు. పిక్కల పట్టేయడం వల్లే అతను రన్ తీయడంలో ఇబ్బంది పడ్డాడని, అది తీవ్రమైనది కాదని స్పష్టం చేశాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్, సెమీ ఫైనల్స్‌కు ఇంకా చాలా సమయం ఉన్నందున మ్యాక్స్‌వెల్ విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని చెప్పాడు.
ఈ మ్యాచ్‌లో 68 బంతుల్లో 12 పరుగులు చేయడంపై కమ్మిన్స్ మాట్లాడాడు. తన వికెట్‌ను కాపాడుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చానని వివరించాడు. తను అవుట్ అయితే తదుపరి బ్యాటర్‌గా ఆడమ్ జంపా రావాల్సి ఉంటుందని, రిథమ్ అందిపుచ్చుకోవడానికి కొంత సమయం పడుతుందని పేర్కొన్నాడు. కేప్టెన్‌గా తన బాధ్యతను తాను నిర్వర్తించానని నవ్వుతూ చెప్పాడు.