కోల్‌కత: ఐసీసీ ప్రపంచ కప్ 2023లో ముగింపు దశకు వచ్చేసింది. గ్రూప్స్ దశలో ఒక్కో మ్యాచ్ మాత్రమే మిగిలివుంది. నేడు రెండు మ్యాచ్‌లు షెడ్యూల్ అయ్యాయి. ఈ ఉదయం 10:30 గంటలకు ఆస్ట్రేలియా- బంగ్లాదేశ్ తలపడనున్నాయి. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది.
రెండోది- మధ్యాహ్నం 2 గంటలకు కోల్‌కతలోని ఈడెన్ గార్డెన్స్‌లో. ఇంగ్లాండ్‌ను ఢీకొడుతుంది పాకిస్తాన్. గ్రూప్ దశలో ఈ నాలుగు జట్లకూ ఇదే చివరి మ్యాచ్‌లు. ఇందులో ఆస్ట్రేలియా ఒక్కటే సెమీ ఫైనల్స్‌కు చేరింది. మిగిలిన మూడూ ఇంటిదారి పట్టక తప్పదు. బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా ఓడినా పెద్దగా తేడా ఉండదు.

ఇంగ్లాండ్- పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ కూడా ఇంతే. ఈ రెండూ సెమీ ఫైనల్స్ రేసు నుంచి తప్పుకొన్నాయి. సాంకేతికపరంగా చూసుకుంటే పాకిస్తాన్‌కు సెమీ ఫైనల్స్ చేరడానికి ఇంకా అవకాశాలు ఉన్నాయి గానీ అది అసాధ్యమే. న్యూజిలాండ్‌కు మించి తన నెట్ రన్‌రేట్‌ను మెరుగుపర్చుకోవాలంటే కొండంత లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందు ఉంచాలి. ఆ తరువాత ఇంగ్లాండ్‌ను 13 పరుగుల్లోపే ఆలౌట్ చేయాలి.
ఇక భారత్ గ్రూప్ దశలో తన తదుపరి మ్యాచ్‌ను ఆదివారం ఆడబోతోంది. బెంగళూరులని చిన్నస్వామి స్టేడియంలో నెదర్లాండ్స్‌తో తలపడుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుంది గేమ్. టోర్నమెంట్ మొత్తానికీ ఇదే చివరి గ్రూప్. దీని తరువాత 15, 16 తేదీల్లో సెమీ ఫైనల్స్, 19న ఫైనల్స్ ఉంటాయి.

కాగా- గ్రూప్ దశలో ఇప్పటివరకు 10 లక్షలమంది అభిమానులు ప్రత్యక్షంగా వరల్డ్ కప్ మ్యాచ్‌లను చూశారు. ఇంగ్లాండ్- న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌తో మొదలైన ఈ టోర్నమెంట్‌లో శనివారం వరకు 42 మ్యాచ్‌లు జరిగాయి. వాటన్నింటికీ అద్భుతమైన ఆదరణ లభించింది. నాన్ ఇండియా మ్యాచ్‌లకు సైతం అభిమానులు పోటెత్తారు.
అటు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌పైనా వ్యూవర్‌షిప్ రికార్డులను సృష్టించిన విషయం తెలిసిందే. కోల్‌కత ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాపై జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఇన్నింగ్‌ను 4.4 కోట్ల మంది చూశారు. అది ఓవరాల్ రికార్డ్. ఇప్పటివరకు హాట్‌స్టార్ చరిత్రలోనే ఈ స్థాయిలో వ్యూవర్‌షిప్ నమోదు కాలేదు.