
హైదరాబాద్: పాకిస్థాన్ యువ బ్యాట్స్‌మన్ బాబర్ అజామ్‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌లో పాక్ విజయాల్లో అతడు కీలకపాత్ర పోషిస్తాడని క్లార్క్ అన్నాడు. బాబర్ అజామ్ అద్భుత ఆటగాడని చెప్పిన క్లార్క్ అతడిని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పోల్చాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
బాబర్ అజామ్‌ను పాకిస్థాన్ విరాట్ కోహ్లీ అంటూ పొగిడాడు. బాబర్ ఆజామ్ బ్యాటింగ్ శైలి అచ్చం కోహ్లీని పోలి ఉంటుందని చెప్పాడు. వరల్డ్‌కప్ టోర్నీలో భాగంగా ప్రస్తుతం వార్మప్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. శుక్రవారం ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ మూడు వికెట్ల తేడాతో ఓడినప్పటికీ బాబర్ అజామ్ సెంచరీతో చెలరేగాడు.
ఈ నేపథ్యంలో మైకేల్ క్లార్క్ మాట్లాడుతూ "బాబర్ అజామ్ క్లాస్ ప్లేయర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. పాక్ లైనప్‌కి అతడు విరాట్ కోహ్లీ. పాక్ జట్టు సెమీస్ లేదా ఫైనల్స్ చేరాలనుకుంటే, ఈ క్రికెటర్ మీదే ఆధారపడాల్సి ఉంది" అని క్లార్క్ తెలిపాడు. కాగా, బాబర్ అజామ్ విషయానికి వస్తే అతి తక్కువ కాలంలో క్లాస్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
టీ20ల్లో కేవలం 26 ఇన్నింగ్స్‌లోనే వెయ్యి పరుగులు సాధించాడు. ఇక, వన్డేల్లోనూ 21 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు చేసి వెస్టిండీస్ దిగ్గజం వీవ్‌రిచర్డ్స్, ఇంగ్లాండ్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్‌ల సరసన నిలిచాడు. ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో సెంచరీతో చేలరేగాడు. టోర్నీలో భాగంగా మే31న పాక్ తన తొలి మ్యాచ్‌లో వెస్టిండిస్‌తో తలపడనుంది.