
విండీస్ బౌలర్లపై దాడి:
భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన బంగ్లాకు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్ (48; 53 బంతుల్లో 6×4), సౌమ్య సర్కార్ (29; 23 బంతుల్లో 2×4, 2×6) ఇన్నింగ్స్ మొదటి నుంచే విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ జోడి తొలి వికెట్‌కు 52 పరుగులు జోడించాక సర్కార్ ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన షకిబ్ స్కోరు వేగాన్ని మరింత పెంచాడు. విండీస్ బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కొంటూ భారీ షాట్లు ఆడాడు.

విండీస్ పైచేయి:
అయితే కొద్ది తేడాలో తమీమ్, ముష్ఫికర్ (1) వికెట్లు కోల్పోయి బంగ్లా కష్టాల్లో పడింది. ఇక్కడే బంగ్లాపై విండీస్ పైచేయి సాధించింది. కానీ జోరుమీదున్న షకిబ్‌కు లిటన్ దాస్ తోడవడంతో బంగ్లా బ్యాటింగ్ సునాయాసంగా సాగింది. విండీస్‌కు సరైన స్పిన్నర్లు లేకపోవడంతో మధ్య ఓవర్లలో కూడా ప్రభావం కనిపించలేదు. ఈ జోడి ఆడుతూ పాడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో బంగ్లా లక్ష్యం దిశగా సాగింది.

నాలుగో వికెట్‌కు 189 పరుగులు:
థామస్ బౌలింగ్‌లో ఓ కవర్ డ్రైవ్‌తో 83 బంతుల్లోనే షకిబ్ సెంచరీ చేసాడు. ఇక గాబ్రియెల్ వేసిన ఓ ఓవర్లో లిటన్ దాస్ వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. దీంతో విండీస్ బౌలర్లు ఏమీ చేయలేని స్థితికి వచ్చారు. కెప్టెన్ హోల్డర్ ఎంతమంది బౌలర్లను మార్చినా ఫలితం దక్కలేదు. షకిబ్, లిటన్ జోడీ నాలుగో వికెట్‌కు 189 పరుగులు జోడించి లక్ష్యాన్ని పూర్తి చేసింది. విండీస్ బౌలర్లలో రసెల్, థామస్‌లకు చెరో వికెట్ దక్కింది. సెంచరీతో పాటు రెండు వికెట్లు పడగొట్టిన షకీబ్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' లభించింది.

హోల్డర్ మెరుపులు:
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. విండీస్ ఓపెనర్ ఎవిన్ లూయిస్ 70; 67 బంతుల్లో 6 ఫోర్లు, 2సిక్సర్లు), షాయ్ హోప్ (96; 121 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), హెట్ మెయిర్ (50; 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు)లు హాఫ్ సెంచరీలతో రాణించారు. చివరలో హోల్డర్ (33; 15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో విండీస్ భారీ స్కోర్ చేసింది. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్, సైఫుద్దీన్‌లు తలో మూడు వికెట్లు తీశారు.


Click it and Unblock the Notifications
