భారత్ Vs పాక్: అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన మ్యాచ్‌లివే

క్రికెట్‌లో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే ఎప్పుడూ ఆసక్తికరమే. ఉత్కంఠతకు గురి చేసేదే. వార్ వన్ సైడ్ అయినట్టు మ్యాచ్ మొత్తాన్నీ భారత్ తన వైపు లాగేసుకున్నా సరే! చివరి నిమిషం వరకూ మ్యాచ్ మొత్తాన్నీ తనివి తీరా చూస్తారు భారత అభిమానులు. చివరి బంతి వరకు ఆటను ఆస్వాదిస్తారు. ఇక ప్రపంచకప్ వంటి మెగాటోర్నమెంట్‌లో ఈ రెండు జట్లూ తలపడితే అభిమానులకు కన్నుల పండగే. టీవీలకు అతుక్కుపోతారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో కొనసాగుతున్న ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం టీమిండియా పాకిస్తాన్‌తో తలపడబోతోంది. మాంచెస్టర్ వేదికగా ఈ మ్యాచ్ వరుణుడు అడ్డు పడకపోతే- మరో మైలురాయి అవుతుంది.
మరో 48 గంటల్లో ఈ రెండు జట్లు హోరాహోరి పోరుకు దిగబోతున్న నేపథ్యంలో.. గత అయిదు ప్రపంచకప్ టోర్నీల్లో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌ల సందర్భంగా కొన్ని ఉత్కంఠ భరితమైన, చిరస్మరణీయమైన సందర్భాలు నమోదయ్యాయి. 1992లో సిడ్నీ, 1996లో బెంగళూరు, 1999లో బర్మింగ్‌హామ్, 2003లో సెంచూరియన్, 2011లో అడిలైడ్ స్టేడియాలు వేదికగా సాగిన మ్యాచ్‌లు కొన్ని మధుర ఘట్టాలను మిగిల్చాయి. వాటిల్లో కొన్ని..

మియాందాద్ కుప్పిగంతులు..
1992 జావెద్ మియాందాద్ వర్సెస్ కిరణ్ మోరే: పాకిస్తాన్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ జావెద్ మియాందాద్ ఎంత అగ్రెసివ్ బ్యాటింగ్ చేస్తాడో.. అంతే దూకుడుగా ఉంటాడు. 1992 ప్రపంచకప్‌లో సిడ్నీలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో మియాందాద్.. ఓ సందర్భంలో తన అక్కసును ప్రదర్శించాడు. అప్పట్లో కీపర్‌గా ఉన్న కిరణ్ మోరే.. మియాందాద్ అవుట్ అయినట్టు గట్టిగా అప్పీల్ చేశాడు. దీన్ని అంపైర్ తోసిపుచ్చాడు. అదే సందర్భంలో కిరణ్ మోరేను అనుకరిస్తూ జావెద్ మియాందాద్ కుప్పిగంతులు వేశాడు. ఆ దృశ్యం క్రికెట్ అభిమానులు గుండెల్లో చెరగని ముద్ర వేసింది. భారత్ విధించిన 217 లక్ష్యాన్ని అందుకోలేక పాక్ చతికిల పడింది. 43 పరుగుల తేడాతో ఓడిపోయింది.

సొహైల్ వెటకారానికి కారం పూసిన వెంకటేష్ ప్రసాద్
1996 వెంకటేష్ ప్రసాద్ వర్సెస్ అమీర్ సొహైల్: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా సాగిన ఈ మ్యాచ్ ఓ హైఓల్టేజ్‌గా మిగిలింది. టీమిండియా స్పీడ్‌స్టర్ వెంకటేష్ ప్రసాద్, పాకిస్తాన్ బ్లాస్టర్ ఓపెనర్ అమీర్ సొహైల్ మధ్య ఓ యుద్ధమే నడిచింది. భారత్ నిర్దేశించిన 280కి పైగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలో దిగిన పాకిస్తాన్ అదిరిపోయేలా ఇన్నింగ్‌ను ఆరంభించింది. వెంకటేష్ ప్రసాద్ బౌలింగ్‌లో బౌండరీని బాదిన తరువాత అమీర్ సొహైల్.. బాల్ బౌండరీ దాటిందని చూపిస్తూ వెటకారంగా వెంకటేష్ ప్రసాద్‌కు సైగలు చేశాడు. వెంకటేష్ ప్రసాద్ సంధించిన ఆ తరువాతి బంతి అమీర్ సొహైల్ వికెట్లను గిరాట్లేసింది. ఇక వెంకటేష్ ప్రసాద్ ఊరుకుంటాడా? అమీర్ సొహైల్‌కు పెవిలియన్ దారి చూపిస్తూ అతని వెటకారాకానికి కారం పూశాడు. ఈ మ్యాచ్‌ను కూడా పాక్ 39 పరుగుల తేడా కోల్పోయింది.

అఫ్రిది స్లెడ్జింగ్..
2003 అఫ్రిది వర్సెస్ కైఫ్: సెంచూరియన్ వేదికగా సాగిన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ స్టార్ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది భారత బ్యాట్స్‌మెన్ మహమ్మద్ కైఫ్‌పై మాటలదాడికి దిగాడు. అతణ్ని రెచ్చగొట్టాడు. స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు. కైఫ్-సచిన్ టెండుల్కర్ మధ్య వంద పరుగుల భాగస్వామ్యం ఏర్పడటంతో సహనం కోల్పోయిన అఫ్రిది.. కైఫ్‌ను టార్గెట్‌గా చేసుకుని స్లెడ్జింగ్ చేశాడు. అయినప్పటికీ.. సహనం కోల్పోలేదు కైఫ్. విలువైన 35 పరుగులను జోడించాడు. ఈ మ్యాచ్‌ను భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలుచుకుంది.

వకార్ యూనిస్‌కు పీడకల..
1996: అజయ్ జడేజా-వకార్ యూనిస్: భారత క్రికెట్ అభిమానులెవ్వరూ మరిచిపోలేని మ్యాచ్ ఇది. టీమిండియా ఆల్‌రౌండర్ అజయ్ జడేజా పాకిస్తాన్ తరుఫుముక్క వకార్ యూనిస్ బౌలింగ్‌ను చీల్చి చెండాడిన మ్యాచ్ అది. అటాకింగ్ బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు అజయ్ జడేజా.. ప్రత్యేకించి యూనిస్ బౌలింగ్‌ను టార్గెట్‌గా చేసుకుని చెలరేగిపోయాడు. బౌండరీల వర్షాన్ని కురిపించాడు. అజయ్ జడేజా దెబ్బకు తన 10 ఓవర్ల కోటాలో వకార్ యూనిస్ 67 పరుగులను సమర్పించుకోవాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ వకార్ యూనిస్‌కు ఓ పీడకలను మిగిల్చింది.

పాక్‌పై విరాట స్వరూపం..తొలి సెంచరీ
అడిలైడ్ వేదికగా 2015లో సాగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ.. పాకిస్తాన్‌పై తన తొలి సెంచరీని సాధించాడు. 126 బంతుల్లో 107 పరుగులను చేశాడు. ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై ఓ భారత బ్యాట్స్‌మెన్ సెంచరీ సాధించడం అదే తొలిసారి. 1996లో నవజ్యోత్ సింగ్ సిద్ధూ, 2003లో సచిన్.. 90కి పైగా పరుగులు చేశారే గానీ సెంచరీ మార్క్‌ను అందుకోలేకపోయారు. ప్రపంచకప్‌లో భారత జట్టుపై సెంచరీ సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్ సయీద్ అన్వర్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications