హైదరాబాద్ పొలీస్ కమీషనర్ సీవీ ఆనంద్.. అప్పుడప్పుడు భారత క్రికెట్ కు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పేలవ ప్రదర్శన చేసినప్పుడు విమర్శిస్తుంటారు కూడా. అయితే తాజాగా ఆయన రోహిత్ శర్మ పేలవ ప్రదర్శన గురించి కామెంట్స్ చేశారు. హిట్ మ్యాన్ కెరీర్ కొనసాగించే బదులు రిటైర్మెంట్ ఇవ్వాలని సూచించారు. ఐపీఎల్ 2025 సీజన్ లో వరుసగా రెండు మ్యాచుల్లో రోహిత్ శర్మ విఫలమైన నేపథ్యంలో సీవీ ఆనంద్.. ఈ కామెంట్స్ చేశారు.
"అనుకోకుండా ముంబయి ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ చూస్తున్నప్పుడు రోహిత్ శర్మ ఔట్ అవ్వడం కనిపించింది. అతడి పరిస్థితి చూసి జాలి కలిగింది. ఎందుకు అతడు నవ్వుల పాలవుతున్నాడు అని అనిపించింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లాంటి అరుదైన సందర్భాల్లో మాత్రమే పరుగులు చేయగలుగుతున్నాడు. ఇలా అప్పుడప్పుడు పరుగులు చేస్తే గౌరవం దక్కుతుందా? ధోనీ - కోహ్లీలాగా ఆడతానే ఉంటావా!, కెరీర్ గొప్పగా ఉంది, మరి గౌరవప్రదమైన రిటైర్మెంట్ లేదే" అని సీవీ ఆనంద్ తాను టీవీలో మ్యాచు చూసిన ఫొటోనూ పోస్ట్ చేశారు. ఆ ఫొటోకే రోహిత్ గురించి అన్న వ్యాఖ్యలను జత చేశారు.

అప్పుడు కోహ్లీ, రోహిత్ పై...
గతంలోనూ సీవీ ఆనంద్.. ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా దారుణ ప్రదర్శనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియా 9 మంది ఆటగాళ్లతోనే ఆడుతోందని, అందుకే ఘోర పరాజయాలు అందుకుంటుందని ఎక్స్‌వేదికగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరును ప్రస్తావించకుండా వారిపై విమర్శలు గుప్పించారు. కాగా, సీవీ ఆనంద్ మంచి క్రికెటర్ అనే సంగతి తెలిసిందే. ఆయన కుమారుడు హైదరాబాద్ జట్టు తరఫున దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు.
దారుణంగా రోహిత్ స్కోర్లు..
ముంబయి ఇండియన్స్ తరఫున నిలకడ ప్రదర్శనతో భారీగా పరుగులు చేస్తూ, జట్టుకు ఎన్నో విజయాలను అందించిన రోహిత్ శర్మ... కెప్టెన్ గానూ జట్టుకు ఐదు టైటిళ్లు అందించాడు. కానీ ఇప్పుడతడు బ్యాటుతో అంతగా ప్రభావం చూపలేకపోతున్నాడు. ఇప్పుడు ఐపీఎల్ 2025లోనూ అతడి పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. తొలి రెండు మ్యాచుల్లో 0,8 పరుగులు చేసి తీవ్రంగా నిరశపరిచాడు. పైగా ఈ రెండు మ్యాచుల్లో ముంబయి కూడా ఓటములను అందుకుంది. ఇక అంతర్జాతీయ క్రికెట్ లోనూ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన అతడు.. టెస్టులు, వన్డేల్లో కొనసాగుతున్నాడు.