హైదరాబాద్: సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ లోధా కమిటీ ఆదేశాలకు లోబడి బీసీసీఐ కార్యకలాపాల్ని నిర్వహించాల్సి వస్తుండటంపై బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ తన అసంతృప్తిని వ్కక్తం చేశాడు. ప్రస్తుతం బీసీసీఐ ఎదుర్కొంటున్న పరిస్థితి భారత క్రికెట్‌కు అంత మంచిది కాదని తెలిపాడు.
ప్రస్తుత, మాజీ క్రికెటర్ల కోసం బీసీసీఐ ఎంతో చేసిందని అన్నాడు. క్రికెటర్లకు మంచిది కాకపోయినా, జనవరి 3న సుప్రీం కోర్టు తీర్పు వెలువరించే వరకు ఓపిక పట్టాలని ఠాకూర్ అన్నారు. ముఖ్యంగా బోర్డు పాలనను విమర్శిస్తున్న కొందరు మాజీలపై ఠాకూర్ విరుచుకుపడ్డారు.
'ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సొంతంగా మౌలిక వసతులను అభివృద్ధి చేశాం. అయినప్పటికీ కొందరు మాజీలు మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు' అని ఠాకూర్ అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి స్థితిలో మేము ఏం మాట్లాడినా, ఏం చేసినా దాన్ని తప్పుగానే చూస్తున్నారు అని ఠాకూర్ వ్యాఖ్యానించాడు.

లక్ష గ్రామాల్లో లక్ష మంది కోచ్‌లను ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించగా 'మా దగ్గర డబ్బులున్నా వాటిని తీయలేం. కోర్టు అనుమతి కావాలి' అని ఠాకూర్ వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. ఐసీసీ వర్కింగ్ గ్రూప్‌లో బీసీసీఐకి చోటు దక్కకపోవడంపై ఠాకూర్ స్పందించాడు.
తమను ఐసీసీ వర్కింగ్ గ్రూప్‌లో చేర్చాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఐసీసీ పట్టించుకోవడం లేదని ఠాకూర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన సమావేశంలో తాను పాల్గొన్నానని బలమైన క్రికెట్ ప్రపంచం కావాలంటే బీసీసీఐ అండ తప్పనిసరి కావాల్సిందేనని అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ భావించారని చెప్పాడు.
ఇక ఇటీవల ఐసీసీ ప్రకటించిన అత్యుత్తమ టెస్టు జట్టులో విరాట్ కోహ్లీకి చోటు దక్కకపోవడంపై కూడా ఠాకూర్ స్పందించారు. భారత్‌కు వరుస విజయాలు అందిస్తున్న ఆటగాడిని ఎలా మర్చిపోతారని ప్రశ్నించాడు. ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో టీమిండియా నెంబర్ వన్ స్ధానంలో ఉందన్న విషయాన్ని ఐసీసీ గమనించాలన్నారు.
కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా అటు స్వదేశంతో పాటు విదేశాల్లో కలిపి ఇప్పటివరకు 18 వరుస టెస్టుల్లో విజయం సాధించింది. ఇక ఐసీసీ అవార్డుల్లో అశ్విన్‌కు టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కడంపై ఠాకూర్ హర్షం వ్యక్తం చేశారు.