హైదరాబాద్: జూన్ 1 నుంచి ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా విజయావకాశాలు కెప్టెన్ కోహ్లీ ఒక్కడిపైనే ఆధారపడిలేదని 1983 వరల్డ్ కప్ విన్నింగ్స్ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నారు. గురువారం ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్‌లో తమ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత కపిల్ మీడియాతో మాట్లాడారు.
ఈ మీడియా సమావేశంలో ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ ఫామ్ భారత అవకాశాలపై ప్రభావం చూపిస్తుందా? అన్న ప్రశ్నకు కపిల్ దేవ్ సమాధానమిచ్చారు. 'ధర్మశాలలో ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్ చూశారా? అప్పుడంతా కోహ్లీ ఆడకపోతే టీమిండియా ఓడిపోతుందన్నారు. కానీ ఏం జరిగిందో మనందరికీ తెలుసు' అని కపిల్ దేవ్ అన్నారు.

'టీమిండియా విజయం కోహ్లీపైనే ఆధారపడిందని అంచనాలు పెంచేసి ఇతర ఆటగాళ్లను దిగజార్చడం సమంజసం కాదు. జట్టులో విరాట్ చాలా ముఖ్యమైన ఆటగాడు. అతడికి ఎప్పుడు, ఎలా ఆడాలో తెలుసు' అని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు.
ప్రణాళికలను కచ్చితంగా అమలు చేసినప్పుడే ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీసేన గెలుపు అవకాశాలు ఉంటాయని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం టీమిండియా యువ ఆటగాళ్లతో నిండి ఉందని, గత ఐదారేళ్లుగా అద్భుతంగా ఆడుతోందని కపిల్ చెప్పాడు.
ఇక ఛాంపియన్స్ ట్రోఫికి సెలక్టర్లు ఎంపిక చేసిన భారత జట్టుపై కూడా కపిల్ స్పందించాడు. సెలెక్టర్లు జట్టు ఎంపికలో అనుభవానికి పెద్దపీట వేయడం మంచిదని కపిల్ చెప్పాడు. సెలక్టర్లతో పోలిస్తే తన అభిప్రాయం వేరుగా ఉండొచ్చని అయితే వారిని విమర్శించడం తన పని కాదని కపిల్ అన్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో ఏ బౌలర్ రాణిస్తాడో చెప్పలేమని అందరూ సమిష్టిగా బౌలింగ్ చేయాల్సి ఉంటుందని కపిల్ పేర్కొన్నాడు. భారత్‌లో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు లేరని అయితే దేశం తనకన్నా మెరుగైన 100 మంది కపిల్‌దేవ్‌లను తయారు చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.
ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ల విషయాన్ని పక్కన పెడితే, అశ్విన్, జడేజా మంచి ఆల్‌రౌండర్లుగా ఎదిగారని కపిల్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీలో జూన్ 4 (ఆదివారం) పాకిస్థాన్‌తో తలపడనుంది. దీంతో పాటు గ్రూప్ బీలో దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లతో భారత్ ఆడనుంది.