చెన్నై సూపర్ కింగ్స్‌తో పోరుకు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ చాలా సమస్యలు ఫేస్ చేస్తోందని మాజీ దిగ్గజం ఆకాష్ చోప్రా అన్నాడు. ఈ సమస్యలు పరిష్కరించకపోతే ప్లే ఆఫ్స్ రేసు నుంచి సన్‌రైజర్స్ తప్పుకునే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా సన్‌రైజర్స్ బ్యాటింగ్ లైనప్ చాలా బలహీనంగా కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశాడు.
'హైదరాబాద్ ముందు ఎన్నో సమస్యలు ఉన్నాయి. స్పిన్‌కు సహకరించే పిచ్‌లపై సన్‌రైజర్స్ బ్యాటింగ్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోతోంది. సొంత మైదానంలో ఆడిన మ్యాచ్‌లో కూడా వాళ్లు ఓడిపోయారు. ముంబైపై లక్ష్యాన్ని ఛేదించేయాల్సింది. కానీ అలా చేయలేకపోయారు' అని చెప్పాడు. అలాగే సన్‌రైజర్స్ ఓపెనర్లు అత్యంత దారుణంగా ఆడుతున్నారని అన్నాడు.

హ్యారీ బ్రూక్ ఒక సెంచరీ కొట్టిన మాట వాస్తవమే అయినా.. మిగతా మ్యాచుల్లో అతను చాలా ఘోరంగా విఫలం అయ్యాడని చోప్రా గుర్తుచేశాడు. ఇక మయాంక్ అగర్వాల్ చివరి మ్యాచ్‌లో 40 పరుగులు చేసినా కూడా అంతకుమించి ఒక్క చెప్పుకునే ఇన్నింగ్స్ కూడా అతని వద్ద లేదన్నాడు. ఇక ఎన్నో అంచనాలు పెట్టుకున్న రాహుల్ త్రిపాఠీ కూడా వరుసగా విఫలం అవుతున్న విషయాన్ని గుర్తుచేశాడు.
'ఈ ఏడాది సీజన్ మొదలైన తర్వాత త్రిపాఠీ కేవలం రెండు మాత్రమే మంచి ఇన్నింగ్సులు ఆడాడు. లక్నోపై ఫర్వాలేదనిపించగా.. పంజాబ్‌పై రాణించాడు. ఇక అంతకుమించి ఏమీ లేదు. చివరి రెండు మ్యాచుల్లో చాలా చెత్తగా ఆడాడు. మార్క్రమ్ బాగానే ఆడుతున్నా.. హెన్రిక్ క్లాసెన్ కూడా రాణించాల్సిన అవసరం ఉంది' అని తెలిపాడు. అలాగే ఉమ్రాన్ మాలిక్ వంటి బౌలర్ ఉన్నా అతన్ని పక్కన పెట్టడం చాలా ఆశ్చర్యం కలిగించిందన్నాడు.
సన్‌రైజర్స్ బౌలింగ్ చాలా బాగుందని, కానీ వాళ్లను టీం మేనేజ్‌మెంట్ సరిగా వాడుకోవడం లేదని చెప్పాడు. 'వాళ్ల దగ్గర ఉమ్రాన్ మాలిక్ ఉన్నాడు. కానీ అతన్ని ఆడించడం లేదు. గత మ్యాచ్‌లో అతన్ని ఎందుకు ఆడించలేదో నాకు అసలు అర్థం కాలేదు. చెపాక్ స్టేడియం చాలా పెద్దది కాబట్టి.. ఇక్కడైనా అతన్ని ఆడిస్తే మంచిది. పిచ్ కొంచెం స్లోగా ఉంది కదా అని అతన్ని పక్కన పెట్టడం కరెక్ట్ కాదు. ఇక్కడ మార్క్ వుడ్ కూడా రెండు వికెట్లు తీశాడని మర్చిపోకూడదు' అని పేర్కొన్నాడు.