ఐపీఎల్‌లో మరో ఉత్కంఠ భరిత మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో రెండు బలమైన జట్లు తలపడేందుకు రెడీ అవుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు చెపాక్‌లో ఢీ కొట్టబోతున్నాయి. ఈ మ్యాచ్ కోసం రాజస్థాన్ జట్టు ఇప్పటికే చెన్నై చేరుకుంది. ఇప్పటి వరకు చెన్నై, రాజస్థాన్ రెండు జట్లు మూడు మ్యాచులు ఆడాయి.
ప్రస్తుతం చెన్నై, రాజస్థాన్ రెండు జట్లు చెరో రెండు విజయాలు సాధించాయి. అయితే నెట్ రన్ రేట్ కారణంగా పాయింట్ల పట్టికలో రాజస్థాన్ మూడో స్థానంలో ఉండగా.. చెన్నై ఐదో స్థానంలో నిలిచింది. చెన్నై తమ తొలి మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో ఓటమి పాలైంది. అయితే ఆ తర్వాత లక్నో, ముంబై జట్లపై వరుస విజయాలు సాధించింది. అదే సమయంలో తొలి మ్యాచ్‌లో ఢిల్లీని చిత్తుగా ఓడించిన రాజస్థాన్.. తర్వాతి మ్యాచ్‌లో పంజాబ్ చేతుల్లో ఓడింది. చివరగా సన్‌రైజర్స్‌పై ఘన విజయం సాధించింది.

రాజస్థాన్ గెలిచిన రెండు మ్యాచుల్లో ఘనవిజయాలు నమోదు చేయడంతో ఆ జట్టు నెట్ రన్ రేట్ భారీగా పెరిగింది. కానీ చెన్నై అంత భారీ విజయాలు సాధించలేదు. దీంతో రెండు జట్లకు సమానంగా పాయింట్లు ఉన్నా కూడా పాయింట్ల పట్టికలో చెన్నై ఐదో స్థానంలో ఉంది. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ గెలిచిన జట్టు ముందడుగు వేస్తుంది. ఈ క్రమంలో చెన్నై చేరుకున్న సంజూ శాంసన్ బృందం.. చెన్నై ఆటగాళ్లను కలిసింది.
ఈ నేపథ్యంలో చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీని సంజూ శాంసన్ కలిశాడు. వీళ్లిద్దరూ కలిసి దిగిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో షేర్ చేసిన సంజూ.. 'సారొచ్చారు..' అని క్యాప్షన్ తగిలించాడు. ఇప్పుడు ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. భారత్‌లో ఉన్న వికెట్ కీపర్ బ్యాటర్లలో చాలా మంది ధోనీని తమ ఐడల్‌గా చెప్పుకుంటారన్న సంగతి తెలిసిందే. సంజూ కూడా వారిలో ఒకడు. అందుకే ఈ ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది.