పంజాబ్‌తో తలపడేందుకు చెన్నై జట్టు రెడీ అయింది. చెపాక్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ టాస్ గెలిచాడు. చివరి మ్యాచ్‌లో రాజస్థాన్ చేతిలో ఓడినా కూడా అదే జట్టును కొనసాగిస్తున్నానని, ఎలాంటి మార్పులు చేయలేదని ధోనీ తెలియజేశాడు. అలాగే పిచ్ డ్రైగా ఉండటంతో ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.
పంజాబ్ సారధి శిఖర్ ధవన్ కూడా తాను టాస్ గెలిచి ఉంటే ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే వాడినని చెప్పాడు. పిచ్ చాలా డ్రైగా కనిపిస్తోందని, ఇక్కడ లక్ష్యాన్ని కాపాడుకోవడమే మంచి నిర్ణయమని అనుకుంటున్నట్లు చెప్పాడు. కానీ బాగా బ్యాటింగ్ చేసి చెన్నై ముందు మంచి లక్ష్యం ఉంచేందుకు ప్రయత్నిస్తామన్నాడు. తమ జట్టులో ఒకే ఒక మార్పు చేసినట్లు వెల్లడించాడు.

చెపాక్‌లో స్పిన్నర్లు కీలక పాత్ర వహిస్తారనే సంగతి తెలిసిందే. ఈ కారణంగానే హర్‌ప్రీత్ బ్రార్‌ను జట్టులోకి తీసుకున్నట్లు ధవన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ నాలుగో స్థానంలో ఉంది. పంజాబ్ ఎనిమిది పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే పాయింట్ల పట్టికలో పంజాబ్ టీం ముందడుగు వేస్తుంది. చెన్నై టాప్-4 నుంచి తప్పుకోవాల్సి వస్తుంది.
అదే ఈ మ్యాచ్‌లో చెన్నై గెలిస్తే మళ్లీ టేబుల్ టాపర్‌గా నిలుస్తుంది. కాబట్టి ఈ మ్యాచ్ చెన్నైకి చాలా కీలకం. అదే జరిగితే ప్లేఆఫ్స్ రేసులో పంజాబ్ మరింత వెనుక పడుతుంది.
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్య రహానే, మొయీన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, మతీష పతిరాణా, తుషార్ దేశ్‌పాండే, మహీష్ తీక్షణ
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధవన్, అథర్వ టైడే, లియామ్ లివింగ్‌స్టోన్, సికందర్ రజా, శామ్ కర్రాన్, జితేశ్ శర్మ, షారుఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్