ఐపీఎల్ ఫైనల్‌లో చెన్నై విజయంలో రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో లాస్ట్ రెండు బంతుల్లో పది పరుగులు అవసరం అయ్యాయి. ఇలాంటి సమయంలో సిక్స్, ఫోర్ బాదిన జడేజా.. చెన్నై టీంకు విజయాన్ని అందించాడు. తను కెప్టెన్ ధోనీ కోసం ఈ మ్యాచ్ గెలిచానని మ్యాచ్ అనంతరం జడ్డూ చెప్పాడు.
ఈ క్రమంలోనే మ్యాచ్ గెలిచిన తర్వాత ఎమోషనల్ అయిపోయిన ధోనీ.. జడేజాను గాల్లోకి లేపి సెలబ్రేట్ చేసుకున్నాడు. ధోనీ భార్యా పిల్లలు కూడా చాలా సంతోషించారు. జడేజా భార్య కూడా ఈ క్రమంలో సంతోషంగా తన పక్కనున్న స్నేహితులను కౌగిలించుకొని ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది.

ఆ తర్వాత మైదానంలోకి వచ్చిన ఆమె.. భర్త జడేజాను చూడగానే వెళ్లి తన కాళ్లకు నమస్కరించింది. అనంతరం భర్తను గట్టిగా కౌగిలించుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నిండు చీరలో ఉన్న ఆమె.. ఇదంతా ముగిసిన తర్వాత భర్త, ధోనీతో కలిసి కూడా పొటో దిగింది. ఆమె ఒడిలో ఐపీఎల్ ట్రోఫీని ఉంచి, చెరొక వైపు ధోనీ, జడేజా కూర్చున్నారు. ఈ ఫొటో కూడా నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ దిగిన ఫొటోలో కూడా.. ట్రోఫీని ధోనీ కుమార్తె జీవా, జడ్డూ కుమార్తె కలిసి పట్టుకున్నారు. వారిద్దరి చుట్టూ మిగతా జట్టంతా నిలబడి ఫొటోలు దిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ విజయం తర్వాత చాలా మంది ధోనీ అభిమానులు ఎమోషనల్ అయిపోతున్నారు.
అయితే ఇదే తన చివరి ఐపీఎల్ కాదని ధోనీ స్పష్టం చేశాడు. ఇప్పుడు రిటైర్‌మెంట్ తీసుకోవడమే కరెక్ట్ అని, కానీ తన అభిమానుల కోసం మరొక్క సీజన్ ఆడాలని ఉందని చెప్పాడు. వచ్చే ఐపీఎల్ వరకు కష్టపడి ఆ సీజన్ కూడా ఆడతానని చెప్పాడు. దీంతో ఫ్యాన్స్ కూడా చాలా సంతోషిస్తున్నారు.