ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతం సృష్టించింది. ధోనీ సేన మరో ట్రోఫీని తమ ఖాతాలో వేసుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ట్రోఫీలు నెగ్గిన జట్టుగా ముంబై రికార్డును చెన్నై సమం చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్‌లో చివరి బంతికి గుజరాత్‌ను చిత్తు చేసింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టుకు అదిరిపోయే ఆరంభం లభించింది. శుభ్‌మన్ గిల్ (39), వృద్ధిమాన్ సాహా (54) అద్భుతంగా రాణించారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సాయి సుదర్శన్ (96) ప్రత్యర్థి బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 214 పరుగులు చేసింది. చెన్నై ముందు భారీ లక్ష్యాన్ని నిలిపింది.

అయితే చెన్నై ఛేజింగ్ మొదలైన వెంటనే వర్షం పడింది. దీంతో మ్యాచ్ కాసేపు నిలిపి వేయాల్సి వచ్చింది. అవుట్ ఫీల్డ్‌ను మ్యాచ్‌కు సిద్ధం చేసే సరికి చెన్నై ఇన్నింగ్స్‌ను 15 ఓవర్లకు కుదించారు. అలాగే ఆ టీం టార్గెట్‌ను కూడా 172 పరుగులకు మార్చారు. ఇలాంటి సమయంలో డెవాన్ కాన్వే (47), రుతురాజ్ గైక్వాడ్ (26) అద్భుతంగా ఆడారు.
వీరితోపాటు అంబటి రాయుడు (18), అజింక్య రహానే (27), శివమ్ దూబే (32 నాటౌట్), జడేజా (15 నాటౌట్) రాణించారు. దీంతో చెన్నై జట్టు చివరి బంతికి విజయం సాధించి మరో ట్రోఫీని తమ ఖాతాలో వేసుకుంది. ఇలా తము ఓడిపోవడంపై గుజరాత్ సారధి హార్దిక్ పాండ్యా స్పందించాడు. తాము బాగా ఆడామని, కానీ ఓడిపోయామని అన్నాడు.
'మేం మనసు పెట్టి ఆడాం. అన్ని విభాగాల్లో చక్కగా రాణించాం. మేం ఎప్పుడూ ఒక టీంగా ఆడుతూ వచ్చాం. ఒక్కరు కూడా మన వల్ల కాదు అనుకోలేదు. కలిసి గెలుస్తాం, కలిసే ఓడిపోతాం. ఈరోజు కూడా అలాంటిదే. ఓడిపోతే సాకులు చెప్పే రకం నేను కాదు. ఈ మ్యాచ్‌లో సాయి సుదర్శన్ అద్భుతంగా ఆడాడు. అతను భవిష్యత్తులో ఎన్నో అద్భుతాలు సృష్టించడం ఖాయం. కానీ చెన్నై టీం మెరుగైన క్రికెట్ ఆడింది' అని హార్దిక్ అన్నాడు.
'మా కుర్రాళ్ల విషయంలో చాలా సంతోషంగా ఉన్నా. వాళ్లకు మేం మద్దతు ఇస్తూనే ఉన్నాం. వాళ్లు సక్సెస్ అవడం చాలా సంతోషంగా ఉంది. మోహిత్, షమీ, రషీద్ అందరూ తలో చెయ్యి వేసి గెలిపించే ప్రయత్నం చేశారు. కోచింగ్ స్టాఫ్‌ను కూడా మెచ్చుకోవాలి. వాళ్ల నుంచి నేను ఇంకేం ఆశించలేను. ధోనీ ఇలా గెలిచినందుకు సంతోషిస్తున్నా. అతను గెలవాలని దేవుడు ఇలా రాసిపెట్టినట్లు ఉన్నాడు. ఒక వేళ నేను ఓడిపోవాల్సి వస్తే.. అతని చేతిలో ఓడిపోవడానికి నాకు ఎలాంటి బాధ లేదు. మంచి వాళ్లకు మంచే జరుగుతుంది కదా' అని పేర్కొన్నాడు.