మరో ఐపీఎల్ సీజన్ ముగిసింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ సీజన్ ఫైనల్‌లో గుజరాత్‌ను ఓడించిన చెన్నై ట్రోఫీని ముద్దాడింది. ఈ సీజన్‌లో అద్భుతంగా ఆడుతూ వచ్చిన గుజరాత్ చివరి మ్యాచ్‌లో చెన్నై బ్యాటర్ల ధాటికి చేతులెత్తేసింది. వరుసగా రెండు సార్లు ట్రోఫీ నెగ్గాలనే గుజరాత్ ఆశలు ఆవిరయ్యాయి.
అయితే వచ్చే ఏడాది మళ్లీ కొత్తగా ఐపీఎల్‌ను ప్రారంభించాలని గుజరాత్ యాజమాన్యం భావిస్తోంది. ఈ క్రమంలోనే కొందరు ఆటగాళ్లను రిలీజ్ చేసేయాలని అనుకుంటోందట. వీరిలో అంతర్జాతీయ స్థాయి ప్లేయర్లతోపాటు, కుర్ర ప్లేయర్లు కూడా ఉండటం గమనార్హం.

కేన్ విలియమ్సన్: న్యూజిల్యాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ ఏడాది ఐపీఎల్ ఆడలేదు. సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో బరిలో దిగిన అతను.. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయపడ్డాడు. దీంతో ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కివీస్ తరఫున వన్డే వరల్డ్ కప్ ఆడటం కూడా అనుమానంగానే ఉంది.
ఒడియన్ స్మిత్: వేలంలో మంచి ధరకు ఒడియన్‌ను గుజరాత్ కొనుగోలు చేసింది. కానీ అతన్ని ఒక్కటంటే ఒక్క మ్యాచులో కూడా ఆడించలేదు. ఈ క్రమంలో అతన్ని రిలీజ్ చేసేస్తే కొంత మొత్తంలో డబ్బు కూడా ఆదా అవుతుందని టీం మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఈ విండీస్ విధ్వంసకర ఆల్‌రౌండర్‌ను కూడా గుజరాత్ వదిలేయనుంది.
యష్ దయాళ్: ఈ సీజన్‌లో అత్యంత పేలవంగా బౌలింగ్ వేసిన బౌలర్ యష్ దయాళ్. అతను ఆడిన ఐదు మ్యాచుల్లో కేవలం రెండు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. ముఖ్యంగా రింకూ సింగ్ ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాదిన తర్వాత దయాళ్ కాన్ఫిడెన్స్ బాగా దెబ్బతిన్నది. దేశవాళీల్లో మళ్లీ రాణిస్తే కానీ అతను ఈ టీంలో చోటు పదిలం చేసుకోలేడు.
ప్రదీప్ సంగ్వాన్: ఈ ఎడం చేతి వాటం పేసర్ కూడా ఒక్కటంటే ఒక్క మ్యాచ్ ఆడలేదు. డెత్ ఓవర్లలో మోహిత్ శర్మ అదరగొడుతుండటంతో సంగ్వాన్‌కు అవకాశమే రాలేదు. దీంతో ఆ జట్టులో సంగ్వాన్ అవసరం లేకుండా పోయింది. దీంతో ఇతన్ని కూడా వచ్చే వేలానికి ముందే రిలీజ్ చేసేయాలని గుజరాత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.