ఐపీఎల్ 2023 ఫైనల్‌లో చెన్నై అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ విజయం తర్వాత ధోనీ మాట్లాడుతూ తను రిటైర్ అవడానికి ఇదే సరైన సమయం అన్నాడు. కానీ తనపై ఫ్యాన్స్ అభిమానం చూస్తే మరొక సీజన్ ఆడాలని ఉందన్నాడు.
ఈ ఐపీఎల్ తర్వాత మరికొన్ని నెలలు కష్టపడతానని, వచ్చే ఏడాది ఐపీఎల్‌లో కూడా అభిమానులను అలరించాలని ఉందని చెప్పాడు. ఈ మాటలు విన్న అభిమానులు తెగ సంతోషంలో మునిగిపోయారు. తమ 'తల' నుంచి ఈ మాటలు వినేందుకే ఎదురు చూస్తూ ఉన్నామని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ మ్యాచ్ విజయం తర్వాత ఎప్పుడూ లేనిది ధోనీ తెగ ఎమోషనల్ అయిపోయిన సంగతి తెలిసిందే.

'ఒక విధంగా చూస్తే రిటైర్‌మెంట్ తీసుకోవడానికి ఇది బెస్ట్ టైం. థాంక్యూ అని చెప్పేసి రిటైర్ అవడం నాకు ఇప్పుడు చాలా ఈజీ. కానీ మరో 9 నెలలు కష్టపడి ఇంకొక్క సీజన్ ఆడటం కష్టమైన పని. శారీరకంగా చాలా కష్టపడాల్సి ఉంటుంది. కానీ సీఎస్కే అభిమానులు నాపై చూపించిన ప్రేమను చూస్తే.. వాళ్ల కోసం మరొక్క సీజన్ ఆడాలని అనిపిస్తోంది' అని ధోనీ చెప్పాడు.
దీంతో తను వచ్చే సీజన్ కూడా ఆడతానని ధోనీ క్లారిటీ ఇచ్చినట్లే అయింది. ఇది విన్న ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు. ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అని ఇంతకుముందు తెగ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దీన్ని ఎప్పటికప్పుడు ధోనీ ఖండిస్తూనే వచ్చాడు. కానీ చాలా మంది ఇదే ధోనీకి చివరి ఐపీఎల్ అని, ఆ తర్వాత అతను ఆడటం జరగదని భావించారు.
ఇప్పుడు ట్రోఫీ నెగ్గిన తర్వాత ధోనీ ఈ విషయంలో క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ అంతా సంతోషిస్తున్నారు. కాగా, ధోనీ రిటైర్‌మెంట్ గురించి కొన్ని రోజుల క్రితం సురేష్ రైనా చెప్పిందే నిమైంది. ధోనీ ఒక ట్రోఫీ నెగ్గుతాడని, ఆ తర్వాత మరో సీజన్ ఆడతాడని రైనా చెప్పాడు. తనకు ఈ విషయం ధోనీనే చెప్పినట్లు వెల్లడించాడు. ఇప్పుడు అదే నిజమైందని ఫ్యాన్స్ అంటున్నారు.