ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతం సృష్టించింది. ధోనీ సేన మరో ట్రోఫీని తమ ఖాతాలో వేసుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ట్రోఫీలు నెగ్గిన జట్టుగా ముంబై రికార్డును చెన్నై సమం చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్‌లో చివరి బంతికి గుజరాత్‌ను చిత్తు చేసింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టుకు అదిరిపోయే ఆరంభం లభించింది. శుభ్‌మన్ గిల్ (39), వృద్ధిమాన్ సాహా (54) అద్భుతంగా రాణించారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సాయి సుదర్శన్ (96) ప్రత్యర్థి బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 214 పరుగులు చేసింది. చెన్నై ముందు భారీ లక్ష్యాన్ని నిలిపింది.

అయితే చెన్నై ఛేజింగ్ మొదలైన వెంటనే వర్షం పడింది. దీంతో మ్యాచ్ కాసేపు నిలిపి వేయాల్సి వచ్చింది. అవుట్ ఫీల్డ్‌ను మ్యాచ్‌కు సిద్ధం చేసే సరికి చెన్నై ఇన్నింగ్స్‌ను 15 ఓవర్లకు కుదించారు. అలాగే ఆ టీం టార్గెట్‌ను కూడా 172 పరుగులకు మార్చారు. ఇలాంటి సమయంలో డెవాన్ కాన్వే (47), రుతురాజ్ గైక్వాడ్ (26) అద్భుతంగా ఆడారు.
వీరితోపాటు అంబటి రాయుడు (18), అజింక్య రహానే (27), శివమ్ దూబే (32 నాటౌట్), జడేజా (15 నాటౌట్) రాణించారు. దీంతో చెన్నై జట్టు చివరి బంతికి విజయం సాధించి మరో ట్రోఫీని తమ ఖాతాలో వేసుకుంది. ఇలా ధోనీ మరో ట్రోఫీ నెగ్గడంతో అతని ఫ్యాన్స్ తెగ సంతోషించారు. హైదరాబాద్‌లో కూడా ఈ హడావిడి కనిపించింది.
నగరంలో పలు చోట్ల వందల సంఖ్యలో రోడ్డెక్కిన ధోనీ అభిమానులు.. 'ధోనీ.. ధోనీ..' అంటూ నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. మ్యాచ్ ముగిసే సరికి అర్ధరాత్రి 1.35 గంటలు అయింది. అప్పటి వరకు మేలుకొని మరీ మ్యాచ్ చూసిన ఫ్యాన్స్‌కు చెన్నై గెలవడం గొప్ప ట్రీట్‌లా మారింది. శివబాగ్ సహా పలు ప్రాంతాల్లో రోడ్డెక్కిన ఫ్యాన్స్ ఇలా ధోనీ, సీఎస్కే నినాదాలతో నగరాన్ని హోరెత్తించారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.