ఐపీఎల్ విజేతలు ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఈ ట్రోఫీ కోసం తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో గుజరాత్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌పై టీమిండియా లెజెండ్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు.
'ఈ సీజన్‌లో శుభ్‌మన్ గిల్ ప్రదర్శన ఎన్నటికీ మర్చిపోలేనిదిగా ఉంది. అతను బాదిన రెండు సెంచరీలు అందరిపై అద్భుతమైన ఇంపాక్ట్ చూపించాయి. ఒక సెంచరీ ముంబై జట్టులో ఆశలు నింపితే.. మరొక సెంచరీ ఆ ఆశలను ఆవిరి చేసింది. క్రికెట్ అంటేనే ఇలా అనుకోని ఘటనలతో నిండి ఉంటుంది కదా' అని సచిన్ అభిప్రాయపడ్డాడు.

'గిల్ విషయంలో నన్ను బాగా ఇంప్రెస్ చేసిన విషయం అతని టెంపర్‌మెంట్, ప్రశాంతంగా ఆడే స్వభావం, పరుగులు చేయాలనే ఆకలి, వికెట్ల మధ్య చక్కని పరుగు అంతా నాకు బాగా నచ్చాయి. భారీ స్కోర్లు నమోదైన మ్యాచుల్లో కొన్ని కీలకమైన సందర్భాలే మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేస్తాయి. ముంబైతో మ్యాచ్‌లో 12వ ఓవర్ తర్వాత గిల్ గేర్ మార్చడంతో గుజరాత్ భారీ స్కోరు చేసింది' అని చెప్పాడు.
'ఆ ఇన్నింగ్స్ మాటలు కాదు. మొమెంటంను పట్టుకొని ఆటపై తన ప్రభావం చూపించే అవకాశం. దాన్ని అతను చక్కగా చూపించాడు. అలాగే ముంబై కూడా కొన్ని సమయాల్లో ముందంజలో నిలిచింది. షమీ బౌలింగ్‌లో తిలక్ 24 పరుగులు చేసినప్పటి నుంచి సూర్య అవుటయ్యే వరకు ముంబై పోటీలోనే ఉంది. గుజరాత్ మంచి బలమైన జట్టు. గిల్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్ వికెట్లు చాలా కీలకం' అని తెలిపాడీ లెజెండరీ క్రికెటర్.
అదే సమయంలో చెన్నై కూడా బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టేనని, ధోనీ ఏకంగా 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్నాడంటే ఆ టీం బ్యాటింగ్ ఎంత డీప్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పాడు. 'కాబట్టి ఈ మ్యాచ్‌లో ఏ టీం బ్యాటింగ్ ప్రత్యర్థిపై పైచేయి సాధిస్తుందో ఆ జట్టే గెలుస్తుంది. ఈ ఫైనల్ కచ్చితంగా చాలా ఆసక్తిగా సాగుతుందని అనుకుంటున్నా' అని చెప్పుకొచ్చాడు.