అహ్మదాబాద్ వేదికగా ఆదివారం నాడు జరగాల్సిన ఐపీఎల్ ఫైనల్ రద్దయింది. భారీ వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను సోమవారానికి వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ధోనీ ఆటను చూసేందుకు వచ్చిన అభిమానులు తెగ ఇబ్బందులు పడుతున్నారు. తమిళనాడు నుంచి గుజరాత్ వచ్చిన వారు.. అర్ధరాత్రి అర్ధంతరంగా హోటల్స్ వెదుక్కోలేక తిప్పలు పడ్డారు.
ఈ క్రమంలో చాలా మంది అభిమానులు రైల్వే స్టేషన్‌ను నమ్ముకున్నారు. అహ్మదాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లి అక్కడే రాత్రి అంతా గడిపారు. ప్లాట్‌ఫాంపై పడుకొని నిద్రపోయారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన చెన్నై ఫ్యాన్స్ అందరూ ధోనీ పై అభిమానంతోనే వీళ్లంతా అహ్మదాబాద్ వచ్చినట్లు అభిప్రాయపడుతున్నారు.

ఇదే విషయాన్ని ఒక ట్విట్టర్ యూజర్ కూడా చెప్పాడు. అర్ధరాత్రి మూడు గంటలకు తాను రైల్వే స్టేషన్ వెళ్లినట్లు చెప్పిన ఆ యూజర్.. అక్కడ చాలా మంది చెన్నై టీం జెర్సీలు వేసుకొని పడుకొని ఉండటాన్ని చూసినట్లు చెప్పాడు. కొందరు నిద్రపోతుంటే, మరికొందరు మెలకువగానే ఉన్నట్లు తెలిపాడు. వారిని తను పలకరించానని, వాళ్లందరూ కూడా ధోనీని చూడటం కోసం తమిళనాడు నుంచి వచ్చినట్లు చెప్పారని వెల్లడించాడు.
ఏదేమైనా ఆదివారం వర్షం కారణంగా రద్దయిన ఐపీఎల్ ఫైనల్.. సోమవారం నాడు పూర్తిగా జరిగేలా కనిపిస్తోంది. ప్రస్తుతం అహ్మదాబాద్‌లో ఎలాంటి మబ్బులు లేవు, వర్షం పడే సూచనలు కూడా కనిపించడం లేదు. దీంతో ఈ అభిమానుల ఎదురు చూపులకు తగిన ఫలితం దక్కేలా కనిపిస్తోంది. వీళ్లందరూ ఉత్కంఠ భరితంగా సాగే ఫైనల్ మ్యాచ్ చూసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
అయితే కొందరు నెటిజన్లు మాత్రం ఈ అభిమానులను తిడుతున్నారు. క్రికెట్ కోసం ఇలా బాధలు పడాల్సిన అవసరం ఏంటని, ఇంట్లో టీవీ పెట్టుకొని చూస్తే సరిపోతుందని ఉచిత సలహాలు ఇస్తున్నారు. మరికొందరేమో సొంత సిటీలో మ్యాచ్ అయితే స్టేడియానికి వెళ్లాలని, వేరే చోట అయితే వెళ్లకూడదని అంటున్నారు.