ఐపీఎల్ ట్రోఫీ కోసం మరోసారి గుజరాత్‌తో పోటీ పడేందుకు చెన్నై టీం రెడీ అయింది. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ ఫైనల్‌లో కూడా చెన్నై టీంలో ఎలాంటి మార్పులూ చేయకూడదని ధోనీ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్ ఆరంభం నుంచి అద్భుతమైన ఆటతీరు కనబరిచిన చెన్నై.. తొలి క్వాలిఫైయర్‌లో గుజరాత్‌ను ఓడించి నేరుగా ఫైనల్ చేరింది.
అనంతరం జరిగిన రెండో క్వాలిఫైయర్‌లో ముంబైని చిత్తు చేసిన గుజరాత్ మళ్లీ ఫైనల్ చేరింది. అయితే వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, అహ్మదాబాద్‌లో జరిగే ఈ ఫైనల్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది. ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన రెండో క్వాలిఫైయర్‌కు కూడా వర్షం అంతరాయం కలిగించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఒకవేళ ఫైనల్ సమయంలో వర్షం పడితే పరిస్థితి ఏంటని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అయితే అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక వేళ ఆదివారం నాడు భారీగా వర్షం పడిన కారణంగా ఫైనల్ మ్యాచ్ కనుక రద్దయితే.. సోమవారం నాడు ఈ మ్యాచ్ నిర్వహిస్తారు. ఎందుకంటే ఆ రోజును ఫైనల్ కోసం రిజర్వ్ డేగా బీసీసీఐ ప్రకటించింది. ఇక ఈ మ్యాచ్ కనుక ఆదివారమే మొదలై, ఆట మధ్యలో భారీ వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోతే.. ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి సోమవారం నాడు మ్యాచ్ నిర్వహిస్తారని తెలుస్తోంది.
ఈ మ్యాచ్‌లో ఫలితం అంటూ తేలాలంటే రెండు జట్లు కనీసం ఐదేసి ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు డక్ వర్త్ లూయిస్ విధానాన్ని బట్టి విజేత ఎవరో నిర్ణయిస్తారు. ఇవన్నీ జరగకపోతే.. రాత్రి 1.20 సమయంలో సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. ఒకవేళ ఇవేమీ జరగడానికి ఆస్కారం లేకపోతే మాత్రం గుజరాత్ టైటాన్స్‌ను విజేతగా ప్రకటిస్తారు. ఎందుకంటే గ్రూప్ దశలో ఈ జట్టు చెన్నై కన్నా మెరుగైన స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.