CSK vs SRH: దక్షిణ భారతదేశంలో క్రికెటర్లు, సినిమా తారలకు భారీ అభిమానులు ఉన్నారు. తమ అభిమాన సూపర్ స్టార్‌ను చూసేందుకు అభిమానులు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. అందుకే సినిమా తారలు బహిరంగ ప్రదేశాల్లో చాలా అరుదుగా కనిపిస్తారు. కానీ కొన్ని సార్లు అభిమానులు తమ అభిమాన సినిమా స్టార్, క్రికెటర్ ను ఒకేసారి చూసే జాక్‌పాట్ కొట్టేస్తారు.
చెన్నైలోని చెపాక్ స్డేడియం వేదికగా జరిగిన చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తాజాగా అలాంటిదే జరిగింది. ఈ మ్యాచ్‌లో సీఎస్కే ఓటమి తర్వాత అభిమానులు కచ్చితంగా నిరాశ చెందుతారు. కానీ వారి అభిమాన స్టార్ తలా అజిత్ కుమార్, హీరో శివకార్తికేయన్ , సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనిని ఒకే స్టేడియంలో చూసే అవకాశం లభించినందుకు వారు కూడా సంతోషంగా ఉన్నారు. మ్యాచ్ వీక్షించేందుకు హీరో శివకార్తికేయన్, కుటుంబంతో కలిసి అజిత్ వెళ్లారు. సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనికి అజిత్ అభిమాని అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో 'ఒకే స్టేడియంలో ఇద్దరు తలాలు' అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. వీరితో పాటు హీరోయిన్ శృతిహాసన్ కూడా ఈ మ్యాచ్ వీక్షించారు.

నిజానికి అజిత్ కుమార్ తమిళ చిత్రాలలో చాలా పెద్ద నటుడు. సీఎస్కే, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌ను చూడడానికి అజిత్ కుమార్ తన భార్య, పిల్లలతో కలిసి స్టేడియానికి చేరుకున్నారు. స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న అజిత్ కుమార్‌ను కెమెరామెన్ గమనించిన వెంటనే అతను చేయి ఊపుతూ ప్రేక్షకులను పలకరించాడు. ఈ సమయంలో గ్యాలరీలో కూర్చున్న సీఎస్కే అభిమానులు కూడా తమ అభిమాన నటుడిని చూడగానే సంబరాలు చేసుకున్నారు. అజిత్ కుమార్ తన 25వ వివాహ వార్షికోత్సవాన్ని ఒక రోజు ముందే తన భార్య షాలినితో కలిసి కేక్ కట్ చేసి జరుపుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు షాలిని తన ఇస్‌స్టాగ్రామ్ టైమ్‌లైన్‌లో తన వివాహ వార్షికోత్సవ వేడుకల వీడియో క్లిప్ ను పోస్ట్ చేసింది.
హీరో అజిత్ సినిమాల గురించి చెప్పాలంటే.. ఈ నెలలో అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ఇది యాక్షన్ సినిమా కావడం గమనార్హం. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఆయన నటించిన 'పట్టుదల ' సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఆయన నిర్మించిన ఈ సినిమా 125 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. అంతర్జాతీయ కారు రేసింగ్‌లలో అజిత్ కుమార్ టీమ్ రికార్ఢులు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ చూడటానికి అజిత్ కుమార్ తో పాటు శివకార్తికేయన్, శృతిహాసన్ కూడా వచ్చారు. హీరో శివకార్తికేయన్ ప్రస్తుతం మదరాసి అనే సినిమాతో బిజీగా ఉన్నారు. శివకార్తికేయన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 5న విడుదల కానుంది.