సొంతమైదానంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. అయిదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ (47*; 35 బంతుల్లో, 1x4, 3x6) టాప్ స్కోరర్. సీఎస్కే బౌలర్లలో సిమర్జీత్ సింగ్ (3/26) మూడు, తుషార్ దేశ్‌పాండే (2/30) రెండు వికెట్లతో సత్తాచాటారు.
అనంతరం ఛేదనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 18.2 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రచిన్ రవీంద్ర (27; 18 బంతుల్లో, 1x4, 2x6), డారిల్ మిచెల్ (22; 13 బంతుల్లో, 4x4) దూకుడుగా ఆడారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (42*; 41 బంతుల్లో, 1x4, 2x6) ఆఖరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించాడు. రాజస్థాన్ బౌలర్లలో అశ్విన్ రెండు, బర్గర్, చాహల్ చెరో వికెట్ తీశారు.

అయితే ఈ మ్యాచ్‌లో జడేజా 'అబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్' కారణంగా ఔటయ్యాడు. అసలేం జరిగిదంటే.. 16వ ఓవర్‌లో అవేశ్ ఖాన్ బౌలింగ్‌లో జడేజా థర్డ్ మ్యాన్ దిశగా షాట్ ఆడాడు. సింగిల్ పూర్తి చేసి జడ్డూ రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. కానీ మరో ఎండ్‌లో ఉన్న రుతురాజ్ రెండో పరుగుకు నిరాకరించడంతో జడేజా వెనక్కి వెళ్లాడు. ఈ లోపు ఫీల్డర్ నుంచి బంతిని అందుకున్న వికెట్ కీపర్ శాంసన్ వికెట్లకు త్రో విసిరాడు.
కానీ జడేజా తన దిశను మార్చుకొని వికెట్ల వైపుకు అడ్డంగా పరిగెత్తాడు. దీంతో రాజస్థాన్ ప్లేయర్లు అంపైర్లకు అపీలు చేశారు. జడేజా ఉద్దేశపూర్వకంగానే వికెట్ల వైపు మళ్లాడని థర్డ్ అంపైర్ నిర్ధారించి ఔట్ ఇచ్చాడు. జడేజా అసహనంగా మైదానాన్ని వీడాడు. ఐపీఎల్ చరిత్రలో అబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కారణంగా ఔటైన మూడో ప్లేయర్ జడేజా. అంతకముందు ఇదే తరహాలో యూసఫ్ పఠాన్, అమిత్ మిశ్రా ఔటయ్యారు.
అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ జడేజా వికెట్లకు అడ్డుగా పరిగెత్తాడు. భువనేశ్వర్ వేసిన త్రోను వికెట్లకు తగలకుండా జడేజా వెనక్కి మళ్లాడు. అయితే ఆ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయర్లు అంపైర్లకు అపీలు చేయలేదు. దాతృత్వంగా వ్యవహరించారు. కాగా, జడేజా కావాలనే అలా చేస్తున్నాడని, తొండాట ఆడుతున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.