Shreyas Iyer: ఐపీఎల్ 2025లో ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతున్న వేళ పంజాబ్ కింగ్స్ కీలక విజయాన్ని నమోదు చేసింది. తాజా మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ సొంత గడ్డపై 4 వికెట్ల తేడాతో ఆ జట్టును ఓడించింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఈ విజయాన్ని సాధించింది. పంజాబ్ బౌలర్లలో చాహల్ (4/32), అర్ష్‌దీప్ (2/25), మార్కో యాన్సెన్ (2/30) రాణించారు. బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ (41 బంతుల్లో 72; 5×4, 4×6), ప్రభ్‌సిమ్రన్ (36 బంతుల్లో 54; 5×4, 3×6) చెలరేగి ఆడడంతో.. 191 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు దక్కింది.
మైదానం ఏదైనా నేను అదే చేస్తా..
మ్యాచ్ విజయం తర్వాత శ్రేయస్ అయ్యర్ హర్షం వ్యక్తం చేశాడు. "ఎటువంటి మైదానంలోనైనా నాకు ఛేజింగ్ అంటే ఇష్టం. పెద్ద స్కోర్ ఉన్నప్పుడు బాధ్యత తీసుకోవడం, నా తర్వాతి బ్యాటర్లకు మోమెంటం కలిగించడం నాకు ఇష్టం. ఇన్‌స్టింక్ట్‌తో ఆడుతూ, ఆత్వవిశ్వాసంతో ముందుకు వెళ్లడం నా ధోరణి. బయటి స్టేడియాల్లో ఆడేటప్పుడు నా ఫామ్ ఎలా ఉందనే విషయం గురించి ఎక్కువగా ఆలోచించాలనుకోవట్లేదు. ప్రస్తుతం ఎంతవరకు వీలైతే అంత.. ఆటను ఆస్వాదిస్తున్నాను. వర్తమానంలో ఉంటూ ప్రతీ బంతిని బాదటానికి ప్రయత్నిస్తున్నాను. బోర్డుపై భారీ లక్ష్యం ఉంటే అది బయట మైదానం అయినా హోమ్ స్టేడియం అయినా నా ఆట విధానం మారదు. కొన్నిసార్లు అది పని చేస్తుంది, కొన్ని సార్లు పని చేయదు. ఒకసారి క్రీజ్‌లో కుదుర్చుకోగలితే ఏ లక్ష్యమైనా ఛేదించగలనని నమ్మకం ఉంది. నెట్స్‌లో ఎక్కువగా బ్యాటింగ్ చేస్తూ, కొత్త బంతితో వేగంగా బౌలింగ్ చేసే బౌలర్లను ఎదుర్కొంటున్నాను.దీని వల్ల బంతి ఎలా వస్తుందో అర్థమై, నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. దీనిపై నేను ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎక్కువగా శ్రమించాను.
నా ఆటిట్యూడ్ ఎప్పుడూ అలానే..
"నేనెప్పుడు మైదానంలోకి అడుగుపెట్టినా నా ఆటిట్యూడ్ హైగానే ఉంటుంది. నేను నాలుగు ముఖ్యమైన విషయాలను అనుసరిస్తున్నాను. అవి పాటిస్తే ఆటపై ప్రభావం చూపుతాయి.
ఇక్కడ బ్యాటింగ్ కన్నా ఎక్కువగా ఫీల్డింగ్ కష్టంగా అనిపించింది. లాంగ్-ఆన్ నుంచి లాంగ్-ఆన్ పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఓవర్ రేట్‌ను కూడా కంట్రోల్ చేయాల్సి రావడంతో వెంటవెంటనే నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఇది వరకు నేను ఆడిన మైదానాలతో పోలిస్తే, ఇక్కడ తేమ మరింత ఎక్కువగా అనిపించింది." అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.
