చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య హైస్కోరింగ్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ మ్యాచ్‌లో చివరకు విజయం మాత్రం చెన్నైనే వరించింది. లక్నో బ్యాటర్లు చివర్లో తడబడటంతో ఫలితం వారికి వ్యతిరేకంగా వచ్చింది. అయితే ఈ మ్యాచ్‌లో కొన్ని అరుదైన రికార్డులు బద్దలయ్యాయి. ధోనీతోపాటు లక్నో ఓపెనర్ కైల్ మేయర్స్ కూడా కీలకమైన ఘనత సాధించాడు. అవేంటో ఒకసారి చూస్తే..
చాహర్‌కు చుక్కలు: చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన పేసర్ దీపక్ చాహర్. అతను ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 63 మ్యాచులు ఆడాడు. అయితే ఒక్క మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసినా కూడా 50 పరుగులు ఇవ్వలేదు. పవర్ ప్లేలో వికెట్లు తీసుకుంటాడనే పేరున్న చాహర్.. 2018లో పంజాబ్ చేతిలో భారీగా బాదించుకున్నాడు. ఆ మ్యాచ్‌లో అతని బౌలింగ్‌లో పంజాబ్ జట్టు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 48 పరుగులు చేసింది. ఇప్పడు లక్నో ఈ రికార్డును బద్దలు కొట్టింది. ఈ మ్యాచ్‌లో చాహర్ బౌలింగ్‌లో వికెట్లేమీ కోల్పోకుండా 55 పరుగులు చేసింది.

ఆర్సీబీ రికార్డు బద్దలు: గతేడాది అరంగేట్రం చేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో చాలా మంది ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఉన్నారు. కాబట్టి ఆ జట్టును తక్కువ అంచనా వేయకూడదు. మంచి బౌలింగ్ కూడా ఉన్న ఆ జట్టు ప్రత్యర్థులను క్రీజులో కుదురుకోనివ్వదు. అయితే గతేడాది ఎలిమినేటసర్ మ్యాచులో ఆర్సీబీ బ్యాటర్లు దినేష్ కార్తీక్, రజత్ పటీదార్ ఇద్దరూ అద్భుతంగా పోరాడారు. లక్నోపై వీళ్లిద్దరూ కలిసి 92 పరుగులు చేశారు. ఇదే లక్నోపై అత్యధిక భాగస్వామ్యం. ఇప్పుడు ఈ రికార్డును చెన్నై ఓపెనర్లు రుతురాజ్, కాన్వే బద్దలు కొట్టారు. వీళ్లిద్దరూ తొలి వికెట్‌కు ఏకంగా 110 పరుగులు జతచేశారు.

కైల్ మేయర్స్ కొత్త రికార్డు: ఈ ఏడాది ఐపీఎల్ అరంగేట్రం చేసిన లక్నో ఓపెనర్ కైల్ మేయర్స్ అరుదైన రికార్డు సృష్టించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై తన తొలి మ్యాచ్ ఆడిన అతను హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మరోసారి చెన్నైపై కూడా అతను అర్ధశతకంతో రాణించాడు. ఇలా తను ఆడిన తొలి రెండు మ్యాచుల్లోనే రెండు హాఫ్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్‌గా మేయర్స్ రికార్డు సృష్టించాడు. గతంలో పాల్ కాలింగ్‌వుడ్, దేవదత్ పడిక్కల్ ఇద్దరూ రెండు హాఫ్ సెంచరీలు చేయడానికి మూడు మ్యాచులు ఆడాల్సి వచ్చింది.