
ఢిల్లీ: గతేడాది పేలవ ఆటతీరుతో ప్లే ఆఫ్స్ కూడా చేరకుండా నిష్క్రమించిన చెన్నై సూపర్ కింగ్స్.. ఈసారి టాప్‌లో దూసుకుపోతోంది. కెప్టెన్ ఎంఎస్ ధోనీ నాయకత్వం, ప్లేయర్స్ అందరూ టాప్ ఫామ్‌లో ఉండడంతో ఇప్పటీకే చెన్నై ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఆదివారం అబుదాబి వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచులో చెన్నై విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకొచ్చింది. మొత్తం ఆడిన 10 మ్యాచ్‌ల్లో 8 విజయాలు సాధించి 16 పాయింట్లతో చెన్నై టాప్‌లో నిలిచింది. ఇక పట్టికలో తన అగ్రస్థానాన్ని కాపాడుకోవడమే చెన్నై ముందున్న లక్ష్యం.
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గతేడాది నుంచి పరుగులు చేయడంలో విఫలమవుతున్నాడు. గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత ధోనీ అత్యుత్తమ ఫామ్‌లో లేడు. ఐపీఎల్ 2020లో ధోనీ 14 మ్యాచులో 116.27 స్ట్రైక్ రేట్ మరియు 25 సగటుతో 200 పరుగులు మాత్రమే చేశాడు. ఇక 2021 సీజన్‌లో ధోనీ ప్రదర్శన మరింత దిగజారింది. 40 ఏళ్ల మహీ 10 గేమ్‌లలో 12.51 సగటుతో 115.90 స్ట్రైక్ రేట్‌లో 52 పరుగులు మాత్రమే చేశాడు. ఇక తన బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేసుకొని ఎక్కువగా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్నాడు. ఇక మూడు నాలుగు మ్యాచ్‌ల్లో మహీ ఆరో స్థానంలో వచ్చాడు.
ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌పై తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. ధోనీ ఇకపై నాలుగో స్థానంలో రావాలని సూచించాడు. చెన్నై జట్టు ప్లేఆఫ్స్‌కు చేరింది కాబట్టి ధోనీ తన బ్యాటింగ్ ఆర్డర్‌లో మరింత ముందుకు రావాలని కోరాడు. తొలుత బ్యాటింగ్ చేసినా, ఛేదనలో అయినా, టీమ్ ఎప్పుడెలా ఆడినా మహీ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాలని సూచించాడు. మరో భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా మహీ తిరిగి ఫామ్‌లోకి రావాలని పేర్కొన్నాడు. 'ఈ ఇన్నింగ్స్ చెన్నై ఆత్మవిశ్వాసంను మరింత పెంచనుంది. రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్, అంబటి రాయుడు మరియు మోయిన్ అలీలు ఫామ్‌లో ఉన్నారు. ధోనీ మరియు సురేష్ రైనా కూడా ఫామ్‌ని అందుకుంటే చెన్నైకి తిరుగుండదు' అని పఠాన్ అన్నాడు.
ఐపీఎల్ 2021లో భాగంగా అబుదాబి వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. కోల్‌కతా నిర్ధేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని చివరి బంతికి ఛేదించిన చెన్నై.. ఐపీఎల్ 2021లో ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకుంది. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా విశ్వరూపం ప్రదర్శించాడు. 12 బంతుల్లో 26 పరుగులు అవసరం అయిన దశలో.. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 19వ ఓవర్లో ఏకంగా 21 పరుగులు చేశాడు. చివరి బంతికి చెన్నై వియానికి ఒక పరుగు అవసరం కాగా.. పేసర్ దీపక్ చహర్ పని పూర్తిచేశాడు. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (40; 28 బంతుల్లో 2×4, 3×6), ఫాఫ్ డుప్లెసిస్ (43; 30 బంతుల్లో 7×4) రాణించారు. కోల్‌కతా బౌలర్లలో రసెల్, ఫెర్గూసన్, ప్రసిద్ధ్ కృష్ణ, చక్రవర్తి, నరైన్ తలో వికెట్ తీశారు.