గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ అంటే ప్రత్యర్థి జట్లు ప్రత్యేకంగా ప్రణాళికలేమి రచించలేదు. నెట్ రన్ రేటు ఎంతమేర సంపాదించుకోవచ్చనే ఆలోచనలతోనే బరిలోకి దిగేవారు. కానీ ఐపీఎల్-2024లో SRH అంటే ప్రతర్థి వెన్నులో వణుకు పుడుతోంది. విజయం గురించి ఆలోచించకుండా పరువు పోకుంటే చాలు అనే రీతిలో ఇతర జట్లు భావించే పరిస్థితి తలెత్తింది.
ఎస్‌ఆర్‌హెచ్ ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి బౌలర్ ఓవర్‌కు 12 పరుగులు ఇస్తే, అతడు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడనే మెచ్చుకునే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ బ్యాటింగ్‌లో ఓవర్‌కు కనీసం పది పరుగులు రావడం కామన్‌గా మారింది. అంతలా మన తెలుగు టీమ్ చెలరేగుతోంది. ఆర్సీబీ 11 ఏళ్ల 262 స్కోరు రికార్డును రోజుల వ్యవధిలోనే సన్‌రైజర్స్ ఏకంగా మూడు సార్లు బ్రేక్ చేసింది.

టాప్ స్కోరర్ జట్టుగా పేరు ఉన్న ఆర్సీబీపైనే 287 పరుగుల రికార్డు స్కోరు చేసింది. బలమైన ముంబై ఇండియన్స్‌ను (277 రన్స్) కూడా ఎస్‌ఆర్‌హెచ్ వదిలిపెట్టలేదు. గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై (266 పరుగులు) విరుచుకుపడింది. దీంతో హైదరాబాద్ జట్టుతో ఆదివారం చెపాక్ వేదికగా జరగనున్న మ్యాచ్‌కు చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడే ప్రణాళికలు రచించడం మొదలుపెట్టింది. రికార్డులు సమర్పించుకోకుండా SRH బ్యాటర్లను కంట్రోల్ చేయాలని చూస్తోంది.
పరుగులు కట్టడి చేస్తూనే ఆదిలోనే సన్‌రైజర్స్ వికెట్లు తీయాలని ప్లాన్ చేస్తోంది. దాని కోసం తుదిజట్టులో భారీ మార్పులు చేయాలనుకుంటుంది. విదేశీ స్టార్ ఆటగాళ్లు ముస్తాఫిజుర్, డారిల్ మిచెల్‌ను పక్కనపెట్టాలని భావిస్తోంది. పవర్‌ప్లేలో ముస్తాఫిజుర్ మెరుగైన ప్రదర్శన చేస్తున్నప్పటికీ డెత్ ఓవర్లలో తేలిపోతున్నాడు. మరోవైపు మిచెల్ ఇంకా ఫామ్‌ను అందుకోలేకపోతున్నాడు. దీంతో వారిద్దరిని తప్పించాలని సీఎస్కే భావిస్తోంది.

గత సీజన్‌లో ధోనీ వ్యూహాలను అమలు చేయాలని చెన్నై నయా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వికెట్ టేకర్ తీక్షణ పరుగులు సమర్పించుకున్నప్పటికీ గత సీజన్‌లో ధోనీ అతన్ని జట్టులో నుంచి తప్పించలేదు. తీక్షణను మాత్రమే కాదు, ఆటగాళ్లను నమ్మి తుదిజట్టును మహీ అలానే కొనసాగించాడు. కానీ రుతురాజ్ జట్టులో క్రమం తప్పకుండా మార్పులు చేస్తున్నాడు. ఇది బెడిసికొట్టింది. దీంతో ధోనీ తరహాలోనే తీక్షణను జట్టులో కొనసాగించాలని రుతురాజ్ ప్లాన్ చేస్తున్నాడు.
పవర్‌ప్లే బాధ్యతలను తీక్షణ, దీపక్ చాహర్‌కు అప్పగించాలని, డెత్ ఓవర్లలో పతిరనా, తుషార్ దేశ్‌పాండేలను ఉపయోగించుకోవాలని సీఎస్కే ప్రణాళికలు రచిస్తోంది. అలాగే హైదరాబాద్ బౌలర్లు జయదేవ్ ఉనద్కత్, నటరాజన్ ఎడమ చేతి వాటం పేసర్లు కావడంతో మొయిన్ అలీని తుదిజట్టులో ఉంచాలని భావిస్తోంది. లెఫ్ట్ హ్యాడెండ్ బ్యాటర్ అలీ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్లను దీటుగా ఎదుర్కోగలడు.