ఐపీఎల్‌లో ఆడిన 14 లీగ్ మ్యాచుల్లో పదింట జయభేరి మోగించిన గుజరాత్ అగ్రస్థానంలో లీగ్ దశను ముగించింది. ఇక గతేడాదితో పోలిస్తే అద్భుతంగా పుంజుకున్న చెన్నై పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు జట్ల మధ్య చెపాక్ వేదికగా తొలి క్వాలిఫైయర్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు గట్టిగా రెడీ అవుతున్నాయి.
ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ను అడ్డుకోవడం చెన్నైకి సవాల్‌గా మారనుంది. వరుస మ్యాచుల్లో సెంచరీలు బాదిన గిల్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా గుజరాత్‌కు మంచి ఆరంభం అందించేందుకు అతను రెడీ అవుతున్నాడు. తాజాగా ఆర్సీబీపై గుజరాత్ విజయంలో కూడా కీలక పాత్ర పోషించాడు.

ఈ మ్యాచ్‌లో గెలవాలంటే చెన్నై జట్టులో కొన్ని కీలకమైన సమస్యలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ టీం బ్యాటింగ్ భారాన్ని కాన్వే, గైక్వాడ్, దూబేనే మోస్తున్నారు. అడపాదడపా అజింక్య రహానే కూడా ఆడుతున్నాడు. మిగతా వాళ్లు పెద్దగా రాణించలేదు. ముఖ్యంగా అంబటి రాయుడు ఈ సీజన్ అంతా ఆడినా ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌లో కూడా సత్తా చాటలేదు.
ఈ క్రమంలో తొలి క్వాలిఫైయర్‌లో రాయుడును పక్కన పెట్టేస్తే బెటర్ అని కొందరు అంటున్నారు. కానీ రాయుడు స్థానాన్ని భర్తీ చేయడానికి ఆ జట్టులో మరో బెటర్ ఆప్షన్ లేదు. దీంతో అతన్నే కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఆ జట్టులో మరో ప్రధాన సమస్య స్పిన్. మహీష్ తీక్షణ ఈ సీజన్‌లో పెద్దగా రాణించలేదు. అయితే చివరి మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించాడు.
తీక్షణను పక్కన పెట్టేయాలని అనుకుంటే ఆ జట్టు వద్ద అద్భుతమైన ఆప్షన్ ఉంది. అతనే కివీస్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్. అతను కావాలంటే బ్యాటుతో కూడా జట్టును ఆదుకోగల సమర్ధుడు. కానీ క్వాలిఫైయర్ వంటి కీలకమైన మ్యాచు ఆడాల్సినప్పుడు జట్టులో మార్పులు చేయడం చెన్నైకి అలవాటు లేదు. కాబట్టి రాయుడు, తీక్షణనే కొనసాగించే అవకాశం కనిపిస్తోంది.
చెన్నై జట్టు (అంచనా): డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానే, మొయీన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), దీపక్ చాహర్, మతీష పతిరాణా, మహీష్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే