తమ చిట్టచివరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఎదుర్కొనేందుకు చెన్నై సూపర్ కింగ్స్ రెడీ అవుతోంది. ఈ మ్యాచ్‌లో కనుక చెన్నై గెలిస్తే.. క్వాలిఫైయర్-1కు ఆ జట్టు చేరుకోవడం గ్యారంటీ. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిస్తే చెన్నై వద్ద 17 పాయింట్లు ఉంటాయి. లక్నో మినహా మరే జట్టూ ఇన్ని పాయింట్లు సాధించడం అసాధ్యమే.
అదే సమయంలో ఈ మ్యాచ్‌లో చెన్నై ఓడితే మాత్రం తొలి రెండు స్థానాల్లో నిలవడం కష్టం. ఇలాంటి కీలకమైన మ్యాచ్ కోసం చెన్నై తమ జట్టులో కొన్ని మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. కానీ ఇప్పటి వరకు ఏ సీజన్‌లోనూ చెన్నై తమ జట్టులో మరీ ఎక్కువగా మార్పులు చేసింది లేదు. కాబట్టి ఈ మ్యాచ్‌లో కూడా ఆశించిన మార్పులు చేయకపోవచ్చు.

సీజన్ ఆరంభంలో చెన్నై జట్టుతో చేరిన బెన్ స్టోక్స్.. గాయం నుంచి దాదాపు కోలుకున్నా కూడా అతన్ని ఈ ఫ్రాంచైజీ ఆడించలేదు. అతని స్థానంలో మొయీన్ అలీనే ఆడిస్తూ వచ్చింది. బ్యాటుతో రాణించడంలో అలీ ఘోరంగా విఫలం అయ్యాడు. అయితే ప్లేఆఫ్స్‌కు ముందే బెన్ స్టోక్స్ స్వదేశం తిరిగి వెళ్లిపోవడంతో అలీనే జట్టులో కొనసాగించే అవకాశం ఉంది.
ఇక చెన్నై తరఫున పెద్దగా రాణించని మరో ప్లేయర్ మహీష్ తీక్షణ. ఈ లంక స్పిన్నర్ ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంలో విఫలమయ్యాడు. అడపా దడపా క్యాచులు కూడా వదిలేశాడు. అతన్ని కనుక చెన్నై పక్కన పెట్టాలని అనుకుంటే.. కివీస్ స్టార్ మిచెల్ శాంట్నర్‌కు జట్టులో అవకాశం దొరుకుతుంది. కానీ తీక్షణను చెన్నై పక్కన పెడుతుందా? అనేదే ప్రశ్న.
అదే సమయంలో డెత్ ఓవర్లలో మరో పేసర్ ఉంటే బాగుంటుందని కనుక ధోనీ భావిస్తే.. సఫారీ ఆల్‌రౌండర్ సిసాండ మగలను ఆడించే అవకాశం ఉంది. అయితే ఈ మ్యాచ్ కోసం ధోనీ తన టీంలో పెద్దగా మార్పులు చేస్తాడని చెప్పలేం. ఆటగాళ్లపై నమ్మకం ఉంచడంలో ధోనీ, చెన్నై ఎప్పుడూ వెనక్కు తగ్గలేదు. అందుకే జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలో దిగినా ఆశ్చర్యం అక్కర్లేదు.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు (అంచనా): డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానే, మొయీన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), దీపక్ చాహర్, మతీష పతిరాణా, మహీష్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే